గర్జించిన మాయావతి దండు
లక్నో: ఉత్తరప్రదేశ్లో దళిత వర్గాలు గర్జించాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతికి అండగా భారీ సంఖ్యలో లక్నో వీధుల్లో బారులు తీరాయి. డప్పులు, ప్లకార్డులు, కర్రలతో పలు అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన హోరు మొదలెట్టాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత దిష్టిబొమ్మలు చేసి వాటిని చెప్పులతో కొట్టి నడిరోడ్లపై తగులబెట్టాయి. వీరిని నిలువరించేందుకు పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన బీజేపీ నేత చేసిన దయా శంకర్ సింగ్ బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పెద్ద ధుమారం రేగింది.
ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా దళితుల మద్దతు కూడగట్టాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న బీజేపీకి చుక్కెదురైనట్లుగా దయా శంకర్ మాటలు మారాయి. దీంతో అతడిని పార్టీ నుంచి పదవి నుంచి తొలగిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయినా దళితుల ఆగ్రహం చల్లారలేదు. అతడిని అరెస్టు చేయాల్సిందేనని, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ అధ్యక్షుడు రాజ్ అచల్ రాజ్భర్ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. దయా శంకర్ వ్యాఖ్యలతో బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అనే విషయం తేలిపోయిందని ఆయన అన్నారు. ఈ ఆందోథన సందర్భంగా తీవ్ర ట్రాఫిక్ జాం తలెత్తింది. పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.