రైతులకు రూ.500కోట్ల రుణాలు ఇస్తాం
- డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి
మెదక్‌టౌన్: రైతులకు ఈయేడాది రూ.500 కోట్ల రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో డివిజన్‌స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మెదక్ డివిజన్లోని పీఏసీఎస్ చైర్మన్లు, డీసీసీబీ డెరైక్టర్లు, సీఈఓలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిట్టిదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పంటరుణాలు, దీర్ఘకాలిక రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తే రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలిస్తామన్నారు. అధికారులు అక్రమాలకు, లంచాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఖరీఫ్‌కు ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయద్వారా చెరువుల్లో తీసే మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయన్నారు. తద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. డీసీసీబీ ద్వారా ట్రాక్టర్లకు, పైపులైన్లకు, బోర్లకు రుణాలివ్వనున్నట్లు తెలిపారు. అనంతరం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సమావేశంలో డీసీసీబీ డీజీఎం మల్లేశం, డీసీసీబీ డెరైక్టర్లు గోవర్ధన్, అనంతరెడ్డి, మెగ్యా నాయక్, నారాయణరెడ్డి, పలువురు పీఏసీఎస్ చైర్మన్లు, వైస్చైర్మన్లు, సీఈఓలు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.