ఉపాధ్యాయుల్లో ‘ఎల్టీసీ’ గుబులు
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం కల్పించిన ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్షెషన్) సుదుపాయాన్ని దుర్వినియోగపరచి జేబులు నింపుకున్న ఉపాధ్యాయుల నుంచి సొమ్ము రికవరీకి గడువు సమీపిస్తుండడంతో అటు అధికారుల్లో, ఇటు ఉపాధ్యాయుల్లోనూ టెన్షన్ మొదలైంది. జిల్లాలో 2008 సంతవ్సరంలో ఎల్టీసీ కింద జిల్లాలో 1900 మంది ఉపాధ్యాయులు దొంగ బిల్లులు పెట్టి ఏకంగా రూ. కోటి 33 లక్షలు దండుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయం వెలుగుచూడడంతో ఆడిట్ జనరల్ జిల్లా వ్యాప్తంగా విచారణ చేయించింది. 2012 డిసెంబరు నుంచి బోగస్ టికెట్లతో ఎల్టీసీ లబ్ధిపొందిన ఉపాధ్యాయుల వివరాలను పంపి, వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని ఏజీ నేరుగా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ఇప్పటిదాకా సుమారు 600 మంది ఉపాధ్యాయుల నుంచి రికవరీ చేశారు. స్వాహా చేసిన డబ్బు తిరిగి చెల్లించారంటే తప్పుచేసినట్లు అంగీకరించినట్టేనని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. బిల్లులు మంజూరు చేసిన ఎంఈఓలపై కూడా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు రెండు నెలల గడువు ఇస్తూ రికవరితోపాటు బాధ్యులపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారో వివరించాలని విద్యాశాఖను ఆదేశించింది.
ఇప్పటికే దాదాపు నెల గడిచింది. కేవలం నెల రోజులు మాత్రమే ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై సమావేశాలు నిర్వహిస్తూ సొమ్ము రికవరీ చేయిస్తున్నారు. అప్పట్లో ఎల్టీసీ మంజూరుకు బిల్లులో సుమారు 25 శాతం దాకా ఖర్చు చేసుకున్న ఉపాధ్యాయులు ప్రస్తుతం మొత్తం బిల్లు వెనక్కు చెల్లిస్తుండడం గమనార్హం. పైగా రికవరీ తర్వాత ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారోనని ఉపాధ్యాయుల్లో టెన్షన్ మొదలైంది. ఈ భాగోతంలో ఉపాధ్యాయులతోపాటు కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ఉన్నారు.