నదిచాగిలో దారుణ హత్య
కౌతాళం : మండల పరిధిలోని నదిచాగి గ్రామంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు హతమయ్యారు. నల్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..డీలరు ఈరన్న, ఈడిగ శివల మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో వివాదం నెలకొని ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. కత్తులు, ఆయుధాలతో ముకుమ్మడిగా దాడులు చేసుకున్నారు.
ఈ ఘర్షణలో డీలరు ఈరన్న(55) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈరన్న పెద్ద కుమారుడు పక్కీరయ్య, చిన్న కుమారుడు ఉసేని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడుల్లో చెన్నప్ప, టపల్ పక్కీరయ్యలకు రక్త గాయాలయ్యాయి. దాడిలో గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ నాగరాజురావు, ఎస్ఐ శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేయలేదని, అయితే ఈ ఘటనపై అన్ని కోణాల్లోను విచారణ జరుపుతున్నామని చెప్పారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో రెండు రోజుల క్రితం ఈదురుగాలులకు స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. రాత్రి ఏడు గంటల సమయంలో ఇరువర్గాల ఘర్షణతో ఏమిజరుగుతుందో అర్థంకాక గ్రామస్తులు భయాందోళన చెందారు.