పరిశోధనలపై దృష్టి సారించాలి
తుమ్మలపాలెం (ప్రత్తిపాడు), న్యూస్‌లైన్: యువ ఇంజినీర్లు తమ మేధస్సును సరికొత్త ఆలోచనలతో పరిశోధనారంగం వైపు మళ్లించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ డీన్ పి.సిద్ధయ్య సూచించారు. తుమ్మలపాలెం మిట్టపల్లి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ‘మిట్టపల్లిస్ లక్ష్యం 2కె-14’ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా హాజరైన సిద్ధయ్య, మిట్టపల్లి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సెక్రటరీ ఎంబీవీ సత్యనారాయణలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రోగ్రాం కన్వీనర్ పి.బాలమురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీన్ సిద్ధయ్య మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో మానవ జీవనశైలిలోనూ మార్పులు సంభవించాయన్నారు. కళాశాలల సెక్రటరీ మిట్టపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే సాంకేతికరంగ మార్పులకనుగుణంగా తర్ఫీదు పొందాలన్నారు. ప్రొఫెసర్ ఎన్.సాంబశివరావు. సీఏ ఓఆర్ త్యాగరాజు తదితరులు మాట్లాడారు.
కార్యక్రమంలో కళాశాల సీఈవో పి.నాగేశ్వరరావు, మిట్టపల్లి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీ భాస్కరరావు, ఆర్వో రూపకుమార్, ఏవో సీహెచ్ శ్రీనివాసరావు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు సాంకేతిక, సాంస్కృతిక, క్రీడారంగాలలో వివిధ రకాల పోటీలను జాతీయస్థాయిలో నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.