మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
నేదునూరు (అయినవిల్లి) :
ఖమ్మం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ.3 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఈ నెల18న మొక్కుబడి తీర్చుకునేందుకు వెళుతూ, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి బంగారమ్మపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలపై చిన్నచూపు చూడడం తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన నేదునూరులో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోతే, వారికి పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలు బేరసారాలు సాగించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వారికి మొక్కుబడిగా పరిహారమిచ్చి చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు. పరిహారం పెంచి ఇచ్చేవరకూ పార్టీపరంగా పోరాటం సాగిస్తామన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం, గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో చర్చించి, మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందేటట్టు చూస్తామన్నారు. మృతుల కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారని చెప్పారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు మట్టపర్తి శ్రీనివాస్, పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ల సాయిరాం, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుత్తుల నాగబాబు, ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి ముత్తాబత్తుల మణిరత్నం, జిల్లా కార్యదర్శి మద్దా చంటిబాబు, సర్పంచ్ కామన కృష్ణమూర్తి, ఎంపీటీసీ సభ్యులు కనుమూరి సత్యనారాయణరాజు, గన్నవరపు శ్రీనివాసరావు, పులిదిండి ప్రభాకర్, గుమ్మడి ప్రసాద్ ఉన్నారు.