భర్త వేధింపులతో భార్య మృతి
లక్కిరెడ్డిపల్లె: అనంతపురం గ్రామం ఈడిగపల్లెకు చెందిన బద్రయ్య, ఈశ్వరమ్మ కుమార్తె అయిన రాచమ్మ అలియాస్ (పద్మావతి)(38) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను భర్తే కడతేర్చారని మృతురాలి తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రి మృతదేహాన్ని ఊరి బయట ఉంచి ఆందోళనకు దిగారు. లక్కిరెడ్డిపల్లె, రామాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతిరాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈడిగపల్లెకు చెందిన ఓబయ్య, రాచమ్మకు 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప, బాబు కలిగారు.
ఓబయ్య చిత్తూరు జిల్లా కార్వేటినగర్లో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ తిరుపతి విద్యానగర్లో నివాసం ఉంటున్నాడు. వీరు ఏడాది నుంచి తరచూ గొడవలు పడుతూ వుండేవారని మృతురాలు బంధువులు తెలిపారు. రాచమ్మకు ఆరోగ్యం సరిగాలేదని, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని భర్త గురువారం ఆసుపత్రికి తేసుకెళ్లి చికిత్స చేయించారు. ఎలుకలు మందు సేవించిందని వైద్యులు నిర్ధారించినట్లు ఓబయ్య సమాధానమిచ్చారని మృతురాలి బంధువులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు వేలూరు ఆసుపత్రికి వెళ్లారు.
అప్పటికే తను చనిపోయిందని తెలుసుకున్న వారు తమ స్వగ్రామానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. శవాన్ని సోమవారం రాత్రి ఈడిగపల్లెకు తీసుకురాగా రీపోస్టుమార్టం చేసి పూడ్చాలని, లేదంటే ఇక్కడే వుంచాలంటూ గ్రామస్తులు పట్టుపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి న్యాయం చేస్తాం అంటూ రామాపురం ఎస్ఐ చలపతి సర్దిచెప్పారు. చివరకు రాత్రి 10 గంటలకు పూడ్చారు. ఈ సంఘటనపై తిరుపతి ఎంఆర్పల్లె పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయినట్లు ఎస్ఐ చలపతి తెలిపారు.