భానుకిరణ్ కోర్టుకు..
విజయవాడ లీగల్, న్యూస్‌లైన్ : అక్రమంగా శ్రీ సాయి అన్నపూర్ణ ప్యాకేజెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడి, సంతకాలు ఫోర్జరీ చేసినట్లుగా దాఖలైన కేసులో నాలుగో నిందితుడు మలిశెట్టి భానుకిరణ్‌ను పోలీసులు మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇన్చార్జి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. నిందితుడిని విచారించి అతని వద్ద విలువైన సమాచారం రాబట్టేందుకు తమ కస్టడీకి ఆరు రోజులు అప్పగించాలని కోరుతూ సి.ఐ.డి. పోలీసులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై వాదనలు వినేందుకు నిందితుడిని కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. నిందితుడు న్యాయవాదిని పెట్టుకోక పోవడంతో కేసు విచారణను శనివారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. నిందితునికి కస్టడీ పిటిషన్ కాగితాలను సి.ఐ.డి. పోలీసులు కోర్టులోనే అందజేయడం విశేషం. స్థానిక పటమటలోని టీచర్స్ కాలనీకి చెందిన వేమూరి శ్యామ్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు వేమూరి కృష్ణప్రసాదు, భానుకిరణ్, మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో ముగ్గురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.
నిందితులపై ఉన్న సెక్షన్లు 448, 506, 471లతోపాటు 420, 468, 109 ఐ.పి.సి. సెక్షన్లను చేర్చాలని కోరుతూ సి.ఐ.డి.పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి శనివారానికి వాయిదా వేశారు. నిందితుడు భానుకిరణ్ సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు.