కేన్సర్ వ్యాప్తి గుట్టు తెలిసింది
కేన్సర్ వ్యాధి ప్రాణాలు తీసే స్థాయికి చేరకుండా నిరోధించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త మార్గాన్ని గుర్తించారు. శరీరంలో కేన్సర్ కణాలు దశల వారీగా ఒక కణితి స్థాయి నుంచి మొదలై ఇతర అవయవాలకు విస్తరించి ప్రాణాలు తీస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలా రక్తం ద్వారా ఇతర అవయవాలకు విస్తరించే ‘మెటాస్టాసిస్’ ఎలా జరుగుతుందన్న విషయం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎలాంటి అవగాహనకు రాలేదు. అయితే జర్మనీలోని గోథె విశ్వవిద్యాలయం, మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ గుట్లు రట్టయింది.
కేన్సర్ కణాలు చిన్న చిన్న రక్త నాళాల గోడల్లో ఉండే ‘డెత్ రిసెప్టార్ 6, (డీఆర్6)’ ను నిర్వీర్యం చేయడం ద్వారా రక్తనాళాలను నాశనం చేసి రక్తంలో కలసిపోతాయని, ఆ తర్వాత ఇతర అవయవాలకు విస్తరిస్తున్నాయని గుర్తించారు. ‘డీఆర్ 6’ను ముందుగా నిర్వీర్యం చేసిన జన్యుమార్పిడి ఎలుకల్లో మెటాస్టాసిస్ తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని స్టెఫాన్ ఒఫర్మాన్స్ వివరించారు. డీఆర్6ను నిర్వీర్యం చేయడం ద్వారా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా అన్నది పరిశీలించాల్సి ఉందని అంటున్నారు. ఈ పరిశోధన ద్వారా అనేక కేన్సర్ కారక మరణాలను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు.