డిసెంబర్లో వాహన విక్రయాలు మిశ్రమం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత రెండో నెల గతేడాది డిసెంబర్లో వాహన విక్రయాలు మిశ్రమంగా ఉన్నాయి. దేశీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విక్రయాలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా డిసెంబర్లో ఒక శాతం క్షీణించాయి. అదే సమయంలో నిస్సాన్ కార్ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు సైతం 42 శాతం వృద్ధి చెందాయి.
మారుతీ దేశీయ విక్రయాలు 4.4 శాతం క్షీణత
2016 డిసెంబర్ నెలలో మారుతి సుజుకి ఇండియా ఎగుమతులతో కలుపుకొని 1,17,908 వాహనాలను విక్రయించింది. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో విక్రయాలు 1,19,149తో పోలిస్తే 1% తగ్గాయి. దేశీయ విక్రయాలను చూస్తే 4.4% తగ్గాయి. 1,06,414 వాహనాలు అమ్ముడుపోయా యి. చిన్న కార్ల శ్రేణిలో ఆల్టో, వ్యాగన్ ఆర్ మోడళ్లు 15.3% తక్కువగా 37,234 అమ్ముడుపోయాయి.
నిస్సాన్ విక్రయాలు ఆశాజనకం: గత డిసెంబర్ నెలలో నిస్సార్ మోటార్ ఇండియా 21% అధికంగా 3,711 వాహనాలను విక్రయించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు... 57,398
డీమోనిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు మెరుగ్గా నమోదయ్యాయి. డిసెంబర్లో 42 శాతం అధికంగా 57,398 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2015 డిసెంబర్లో విక్రయాలు 40,453గానే ఉన్నాయి. ఎగుమతులు సైతం భారీగా పుంజుకున్నాయి. 160 శాతం అధికంగా 1,082 వాహనాలను కంపెనీ ఎగుమతి చేసింది. ఏప్రిల్–డిసెంబర్ కాలంలో విక్రయాలు 36 శాతం అధికంగా 4,88,262గా నమోదైనట్టు కంపెనీ తెలిపింది.