పోలీసులకు వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యం
– వారాంతపు సెలవులను అమలు చేస్తాం
– పెరేడ్ పరిశీలనలో ఎస్పీ హామీ
కర్నూలు: పోలీసు శాఖలో విధులు నిర్వహించేవారికి వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యమని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శుక్రవారం ఉదయం పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో సివిల్, ఏఆర్ సిబ్బంది నిర్వహించిన పెరేడ్‌కు ఎస్పీ హాజరై పరిశీలించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధుల్లో వ్యక్తిగత క్రమశిక్షణతో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. 40 ఏళ్లు దాటినవారు అనారోగ్యం బారిన పడి చనిపోవడంతో వారి కుటుంబాలు మానసిక క్షోభకు గురవుతున్నాయని అన్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ భద్రత రుణ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు. మీపై ఆధారపడిన కుటుంబాల గురించి ఆలోచించుకోవాలని సూచించారు. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు ప్రజలను ఎలాంటి అసౌకర్యానికి గురి చేయవద్దన్నారు. సహనం కోల్పోయి ఒక్కరు తప్పు చేస్తే ఆ ప్రభావం పోలీసులందరిపై పడుతుందన్నారు. సంవత్సరాంతంలో నేరాలు తగ్గించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. డీఎస్పీ రమణమూర్తి, సీఐలు నాగరాజరావు, కృష్ణయ్య, మధుసూదన్‌రావు, మహేశ్వరరెడ్డి, ఆర్ఐ రంగముని, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.