డీఆర్డీఏ డీలా
= గాడితప్పిన పాలన
= ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు
= 21 నెలలుగా డీఆర్డీఏకు
ఇన్చార్జ్ పీడీలే దిక్కు
= నేడు సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్ రాక
అనంతపురం టౌన్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగులో క్షేత్రస్థాయి నుంచి పరిపాలన గాడితప్పింది. సుమారు రెండేళ్లుగా ఇక్కడ ఇన్చార్్జల పాలనే కొనసాగుతోంది. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం.. వచ్చిన వాళ్లు తమ స్వలాభం కోసం పని చేసుకుంటూ వెళ్లిపోతుండటంతో వ్యవస్థలో మార్పు రావడం లేదు. 2014 నవంబర్ 22 నుంచి డీఆర్డీఏ–వెలుగుకు పూర్తి స్థాయి పీడీ అందుబాటులో లేరు. గత ఏడాది మే నుంచి వెంకటేశ్వర్లు ఇన్చార్్జగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు పౌరసరఫరాల శాఖ డీఎంగా ఉన్న వెంకటేశం, డీఆర్డీఏలో ఏపీడీగా ఉన్న మల్లీశ్వరి ఇన్చార్్జగా ఉన్నారు. పైగా రెండు ఏపీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరికి ఇష్టం వచ్చినట్లు విధి నిర్వహణ సాగిస్తున్నారు. ప్రస్తుతం పీడీగా ఉన్న వెంకటేశ్వర్లు ఏపీఎంఐపీగా పూర్తిస్థాయి పీడీగా ఉన్నారు. ఫలితంగా డీఆర్డీఐపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు. దీన్ని సాకుగా చేసుకుని కొందరు అధికారులు గ్రూపు రాజకీయాలు నడుపుతూ జిల్లా కేంద్రంలో పబ్బం గడుపుకుంటున్నారు.
ఇటీవల జరిగిన బదిలీల్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. ఉన్నతాధికారుల పాత్ర కూడా ఇందులో ఉండటంతోనే పత్రికల్లో వచ్చినా ఎవరూ స్పందించలేదన్న విమర్శలొచ్చాయి. ఇక గ్రూపు రాజకీయాలకూ ఇక్కడ కొదవలేదు. సాక్షాత్తూ ఉన్నతాధికారులే కొంత మందిని పెంచి పోషిస్తుండటంతో కొందరు ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల జీతాలకు సంబంధించి కూడా విమర్శలు వచ్చాయి.
బడ్జెట్ విడుదలైనా ట్రెజరీలో బిల్లులు చెల్లించడానికి ఓ అధికారి నిర్లక్ష్యం చేయడంతో మూడు నెలల పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉన్నతాధికారి కూడా పూర్థి స్థాయిలో కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంతో సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఎప్పుడు విధులకు వస్తారో.. ఎప్పుడు లేదో కూడా తెలీని పరిస్థితి. ఈ నేపథ్యంలో సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్ సోమవారం జిల్లాకు రానున్నారు. సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటి సారిగా ఇక్కడకు వస్తుండటంతో కొందరు ఉద్యోగులు సైతం తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా సీఈఓ ప్రత్యేక దృష్టి పెడితేనే ఇక్కడ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.