కథువా కేసు: సందిగ్ధంలో వారి పెళ్లి
జమ్మూ: ‘అతడి కళ్లలోకి సూటిగా చూస్తూ.. నువ్వు నేరం చేశావా అని అడుగుతాను. నాపై అతడికి నమ్మకముందని నాకు తెలుసు. తను నేరం చేయలేదని చెబితే అతడు తిరిగొచ్చే వరకు వేచి చూస్తాను. ఒకవేళ అతడు నేరం చేశాడని చెబితే మరో సంబంధం చూడమని మా అమ్మానాన్నతో చెబుతాన’నని 24 ఏళ్ల రేణు శర్మ అనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థిని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా హత్యాచార ఘటన కేసులో ప్రధాన నిందితుడు దీపక్ ఖాజురియాకు కాబోయే భార్య ఆమె. గతేడాది డిసెంబర్ 7న వీరిద్దరికీ వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈనెల 26న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. రసన గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి చంపిన కేసులో దీపక్ జైలు పాలవడంతో వీరి పెళ్లి సందిగ్ధంలో పడింది.
క్రైం బ్రాంచ్ పోలీసుల చార్జిషీటు ప్రకారం ఈ కేసులో దీపక్ ప్రధాన నిందితుడు. అయితే తనకు కాబోయే భర్త ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే నమ్మలేకపోతున్నారని రేణుక పేర్కొన్నారు. బాలికను రేప్ చేసి చంపేంత క్రూరుడు కాదని ఆమె చెబుతున్నారు. అతడితో ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి ఈ అంచనాకు వచ్చినట్టు చెప్పారు. ‘ నిశ్చితార్థం రోజున అతడిని ఒకసారి మాత్రమే అతి సమీపం నుంచి చూశాను. తర్వాత మేము ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. పోలీసులు చెబుతున్నట్టుగా అతడికి ప్రవర్తన నాకెపుడూ కనబడలేదు. వీడియో చాట్ చేద్దామని అతడు కోరినప్పుడు నేను తిరస్కరిస్తే మళ్లీ బలవంతం చేయలేద’ని రేణుక వెల్లడించారు. దీపక్‌ను తప్పుబట్టడం కానీ సమర్థించడం కానీ చేయబోనని అన్నారు. ‘వాస్తవమేంటో నాకు తెలియదు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపడితేనే నిజాలు వెల్లడవుతాయ’ని ఆమె అభిప్రాయపడ్డారు.
దీపక్ నాలుగేళ్ల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరారు. తర్వాత అతడికి హీరానగర్ పోలీసు స్టేషన్లో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ)గా నియమించారు. రసన గ్రామంలో బాలిక దారుణ హత్యాచారానికి గురైనప్పుడు అతడు పరిసర ప్రాంతాల్లో సంచరించినట్టు గుర్తించారు. మెలితిరిన మీసాలు, కత్తిరించిన గడ్డంతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌పై రసన గ్రామం దాటుతుండగా అతడిని చూసినట్టు సాక్షులు చెబుతున్నారు. ఈ కిరాతక ఘటన జరగడానికి ముందు బకర్వాల్ ముస్లిం మహిళలతో దీపక్ రెండుసార్లు గొడవ పడినట్టు అతడి తల్లి దర్శనాదేవి, సోదరి శివాని వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.
హత్యాచారం కేసులో అరెస్టైన నలుగురు పోలీసుల్లో దీపక్ ఒకరు. మిగిలిన ముగ్గురు నిందితులు లంచం కోసం కేసును తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దీపక్ ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. పరీక్షల్లో పాసయ్యేందుకు సాయం చేస్తానని నమ్మబలికి 15 ఏళ్ల బాలుడి సహాయంతో బాలికను దీపక్ కిడ్నాప్ చేశాడని క్రైం బ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.