మన జింకకు మంచిరోజులు..!
నాగిరెడ్డిపేట : కిలోమీటర్ల పొడవునా పచ్చని చెట్లు.. చెంగుచెంగున ఎగిరే వన్యప్రాణులతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది పోచారం అభయారణ్యం. ఈ అభయారణ్యం నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఇక్కడి పచ్చదనాన్ని, జింకలు, వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు. రెండు జిల్లాలతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు.
జింకల రక్షణ కోసం
ఈ ప్రాంతంలో జింకలు అధికంగా ఉండటంతో వాటిని సంరక్షించడంతో పాటు వాటి సంతతిని పెంచాలనే ఉద్దేశంతో షికార్‌ఘర్‌గా పిలువబడే ప్రాంతా న్ని 1950లో పోచారం అభయారణ్యంగా గుర్తించారు. అనంతరం జింకల సంతతి ని పెంచేందుకు రెండు ప్రత్యుత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అభయారణ్యం మొత్తం విస్తీర్ణం 164హెక్టార్లు కాగా, వీటిలో మొదటి జింకల ప్రత్యుత్పత్తి కేం ద్రం 125హెక్టార్లలో ఏర్పాటుచేయగా, మిగతా 39హెక్టార్లకు సంబంధించి 1986లో రెండో ప్రత్యుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో ప్రత్యుత్పత్తికి అవసరమైన చర్యలు చేపడుతూ జింకల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నారు.
సందర్శకులకు కనువిందు
పోచారం వన్యప్రాణి అభయారణ్యాన్ని సందర్శించే వారికి జింకలు కనువిందు చేస్తాయి. అభయారణ్యంలో చుక్కల జింకలు, జింకలు, నెమళ్లు, కొండగొర్రెలు, అడవి పందులు, నీలుగాయిలు, సాంబార్లు ఎక్కువగా ఉన్నాయి. అటవీ అధికారుల అనుమతి పొంది, అభయారణ్యంలోకి వెళ్లే పెద్దసంఖ్యలో జింకలను, వన్యప్రాణులను తిలకించవచ్చు. గుంపులు గుంపులుగా తిరిగే జింకలు మనుషుల అలికిడి వినగానే చెంగు చెంగున దూకుతూ.. పరుగులు పెట్టడాన్ని ఆస్వాదించవచ్చు.
అభయారణ్యంలో డీబీసీ-1లో మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. ఇందులోకి నాలుగు చక్రాల వాహనాల లో మాత్రమే లోనికి వెళ్లనిస్తారు. వాహనానికి రూ. 100, ఒక్కొ వ్యక్తికి రూ. 20చొప్పున ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తమ వెంట కెమెరాను తీసుకెళ్తే అదనంగా మరో రూ. 100 చెల్లించాలి. సుమారు 5 కిలోమీటర్ల మేర తిరిగి వన్యప్రాణులను తిలకించవచ్చు. ప్రభుత్వం జింకను రాష్ట్ర జంతువుగా ప్రకటించడంతో పోచారం అభయారణ్యానికి ప్రాధాన్యత సంతరించుకుంటోం ది. ఇక నుంచైనా ఈ ప్రాంతం పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని పర్యాటకులు వ్యక్తంచేస్తున్నారు.
పెరుగుతున్న సంతతి
ప్రత్యుత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో క్రమంగా అభయారణ్యంలో జింకల సంతతి పెరుగుతోంది. ఈ కేంద్రాల వల్ల అభయారణ్యంలో ప్రతియేడు 80 నుంచి 100 జింకలు జన్మిస్తున్నాయి. నాలుగేళ్లక్రితం సుమారు 200 జింకలు ఉండగా, తాజా గణాంకాల ప్రకారం వాటిసంఖ్య 500పైగా పెరిగింది. ప్రత్యుత్పత్తి కేంద్రాల్లో జింకలకు అధికారులు ప్రత్యేకంగా ఎలాంటి దాణా ఇవ్వరు. అభయారణ్యంలో సహజంగా పెరిగే గ్రాసాన్ని తినే పెరుగుతాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన జింకలను కాస్త పెద్దయ్యాక మెదక్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలి పెడుతుంటారు.
నాటి షికార్‌ఘర్..
నిజాంకాలంలో అప్పటి ప్రభువులు జంతువులను వేటాడేందుకు తరుచూ ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఈ ప్రాంతాన్ని అప్పట్లో షికార్‌ఘర్‌గా పిలిచేవారు. క్రమక్రమంగా అదే పోచారం వన్యప్రాణుల అభయారణ్యంగా మారింది. జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలతో పాటు మెదక్ జిల్లాలోని మెదక్ మండల పరిధిలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. వేటాడేందుకు వచ్చిన సమయంలో నిజాం పాలకులు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ రెండు భారీ అతిథి గృహాలను నిర్మించారు. కాలక్రమంలో ప్రభుత్వ ఆదరణ కరువై ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.