ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరం
సినిమా రంగంలో ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరమని వర్థమాన నటుడు ధీరేంద్ర అన్నారు. చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టమని, పాఠశాల, కళాశాలలో చదివే సమయంలో 50 వరకు స్టేజ్ ప్రోగ్రామ్‌లు చేశానని చెప్పారు. ఈ క్రమంలో ‘రెడ్ అలర్ట్’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చిందని తెలిపారు. మంగళవారం షీలానగర్‌లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో తన అనుభవాల్ని పంచుకున్నారు.
ప్రశ్న : మీ స్వస్థలం ఎక్కడ, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది.?
జ. మాది తిరుపతి, సినీ నటుడు మోహన్‌బాబు గారి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో బీటెక్, ఎంబీఏ పూర్తి చేశాను. మా నాన్న గారి ఉద్యోగి రీత్యా విశాఖలోని సిరిపురంలో మూడేళ్లగా ఉంటున్నాం.
ప్రశ్న : సినిమా రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు?
జ. చిన్నప్పటి నుంచి నటన అంటే అమితమైన ఇష్టం. చిత్ర పరిశ్రమలో ప్రవేశించి హీరోగా ఎదగాలని ఉండేది. పాఠశాల, కళాశాలల్లో చదివే సమయంలో చాలా నటకాలు వేశాను. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. మోహన్‌బాబు గారి చేతులమీదుగా బహుమతులు అందుకున్నాను.
ప్రశ్న : సినిమా రంగంలోకి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?
జ. మోహన్‌బాబు గారు. ఆయన డైలాగ్ డెలివరి బాగుంటుంది.
ప్రశ్న : ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు? ఏయే భాషల్లో నటిస్తున్నారు ?
జ. తెలుగులో మూడు సినిమాలు చేశాను. రెడ్ అలర్డ్ రిలీజ్ అయ్యింది. కలి సినిమా పూర్తి కావచ్చింది. మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను.
ప్రశ్న : ఎవరి వద్దయినా శిక్షణ తీసుకున్నారా?
జ. మొదట్లో అనుపమ కేర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాను. విశాఖ వచ్చిన తరువాత స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద చేరాను. ఆ సమయంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి.
ప్రశ్న : విశాఖ నగరంతో అనుబంధం?
జ. విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. నగరాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అన్ని ప్రదేశాలను చుట్టేశాను. విశాఖలో చిత్ర పరిశ్రమకు కావల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.