పేదల కార్డులు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
గడపగడపకూ వైఎస్సార్‌లో ఫిర్యాదుల పరంపర
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్ :
రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన తెల్లరేషన్ కార్డులను చంద్రబాబునాయుడు ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు విమర్శించారు. మంగళవారం రమణయ్యపేటలోని తన నివాస గృహంలో పత్రికా విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు లక్షా 40 వేల రేషన్ కార్డులను నిలిపి వేశారన్నారు. మొత్తం 14 లక్షల 10 వేల రేషన్‌కార్డులు జిల్లాలో ఉంటే ప్రస్తుతం ఒక లక్షా 60 వేల తెల్లకార్డులకు మాత్రమే సరుకులను అందజేస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం పేదల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసించేందుకు కుట్ర పన్నిందని, దీనిలో భాగంగా ప్రతీ తెల్లకార్డు ఆధార్‌ను అనుసంధానం చేసి వాటి వివరాలను ఆదాయపన్ను, వాణిజ్యపన్నుల శాఖలకు పంపడంలో మర్మం ఏమిటో ప్రజలకు చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆదాయపు పన్నుల చెల్లింపులను తెల్లరేషన్ కార్డులకు అనుసంధానం చేసి రాష్ట్రంలో లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తే పేదలకు అందించే సంక్షేమ పథకాలను మొత్తం తీసివేసి, రాష్ట్రంలో పేదలే లేరని తేల్చి చెప్పే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల్లో అర్హులందరికీ కార్డులు ఇచ్చి ప్రభుత్వ, రేషన్ విధానాలను మెరుగుపరిస్తే చంద్రబాబు వచ్చాక మళ్లీ పేదలకు అన్యాయం చేసే కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం తెరతీస్తోందని విమర్శించారు. జిల్లాలో గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమంలో పర్యటిస్తున్నప్పుడు ప్రతి నెల 1వతేదీ నుంచి 5వ తేదీ వరకు మాత్రమే రేషన్ ఇస్తున్నారని, సమయం దాటితే ఇవ్వడంలేదని ప్రజలు చెబుతున్నారని వివరించారు. ఈ పాస్ విధానం వచ్చాక ఇంటర్నెట్ అనుసంధానం కాక అదే విధంగా బయోమెట్రిక్ విధానంలో వ్రేలు ముద్రలు సరిగా పడక పేదలు నష్టపోతున్నారన్నారు. పేదల కార్డులు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర