ఆ వీడియో తీసుకున్నది మంత్రేనట!
ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉండి మంత్రిపదవి కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సందీప్ కుమార్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదని, కనీసం ఆరేడేళ్ల క్రితం నాటిదని సందీప్కుమార్కు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ఆయన ఇంకా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టలేదని, అప్పటికి న్యాయ విద్య చదువుతూ ఉన్నారని అంటున్నారు. ఇందులో ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే.. సదరు వీడియో, ఫొటోలను ఆయనే స్వయంగా తీసుకున్నారని చెబుతున్నారు!! సందీప్ కుమార్ చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లు ఎక్కడా లేదు. వీడియోలో ఉన్న మహిళలు గానీ, సందీప్ భార్య గానీ ఆయన మీద ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.
కానీ, వీడియో.. ఫొటోలు ఉన్న సీడీ తనకు అందిన సరిగ్గా అరగంటలోనే ఆయన మంత్రి పదవి ఊడిపోయింది. ''మా మౌలిక విలువల విషయంలో మేమెప్పుడూ రాజీపడే ప్రసక్తి లేదు. తపపుడు పనులను భరించేకంటే ప్రాణాలు వదలడానికే ఇష్టపడతాం'' అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాగా, ఇలాంటి కేసులోనే అభిషేక్ సింఘ్వి కూడా అన్ని పార్టీ పదవులు, పార్లమెంటరీ కమిటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు.
నష్ట నియంత్రణ చర్యలలో భాగంగానే సందీప్ కుమార్ మీద కేజ్రీవాల్ చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ప్రదర్శనలు నిర్వహించాయి. తాను ఖండించలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే కేజ్రీవాల్ ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటారని ఆప్ మాజీ నేత యోగేంద్రయాదవ్ అన్నారు.