మెట్రో ప్రాజెక్టు విస్తరణపై దృష్టి
మెట్రో ప్రాజెక్టు విస్తరణ అంశంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదిక రూపకల్పన బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించింది. ఈ నివేదిక డిసెంబర్ ఆఖరునాటికల్లా పూర్తవుతుందని, వీలైనం త్వరగా పనులను చేపడతామని ప్రభుత్వం చెబుతోంది.
నోయిడా: నోయిడా-ఢిల్లీ-గ్రేటర్ నోయిడా మధ్య ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టు విస్తరణ పనులు ప్రారంభమయ్యే రోజు దగ్గరపడుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మించతలపెట్టిన ప్రాంతాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ శుక్రవారం సందర్శించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లూప్ మార్గంలో నోయిడా, గ్రేటర్ నోయిడా మెట్రో మార్గాన్ని విస్తరించనున్నట్టు తెలిపారు. ఈ మార్గం వివిధ ప్రదేశాలమీదుగా సాగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును పశ్చిమ జనక్‌పురి-బొటానికల్ గార్డెన్తో అనుసంధానం చేస్తామన్నారు. దీని పొడవు 16.5 కిలోమీటర్లని, యుమునా నది ఒడ్డున గల కాళింది బర్డ్ శాంక్చువరీతోపాటు సెక్టార్ 143ని అనుసంధానం చేస్తుందన్నారు.
ఈ మార్గాన్ని గ్రేటర్ నోయిడా పరిధిలోని బొడాకి గ్రామం వరకూ పొడిగిస్తామన్నారు.
అదే మా లక్ష్యం: అన్ని ప్రాంతాలను మెట్రో మార్గం ద్వారా అనుసంధానం చేయడమే తమ లక్ష్యమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ పేర్కొన్నారు. రెండు కొత్త మార్గాలను నిర్మించతలపెట్టామని, ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదిక వచ్చే నెల ఆఖరునాటికల్లా సిద్ధమవుతుందన్నారు. ఈ రెండు మార్గాల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు. ప్రతిపాదిత మార్గాలకు సంబంధించి అవగాహన పత్రాలపై సంతకాలు కూడా జరిగిపోయాయన్నారు. వీలైనంత త్వరగా ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ప్రారంభిస్తామన్నారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చొరవ: నోయిడాలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యూపీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రంజన్ పేర్కొన్నారు. ఇందుకోసం నగరంలో ఆర్టియల్ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు, అండర్‌పాస్‌లు, వంతెనలను నిర్మిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రాజెక్టు పనుల పూర్తికి నిర్దిష్ట కాలపరిమితి విధించుకోవాలని, తరచూ తనిఖీలు చేయాలని కూడా ఆదేశించానన్నారు. ఆటంకాలు లేకుండా చేస్తాం: ప్రతిపాదిత ప్రాజెక్టు పనుల కోసం భూసేకరణ, ఇతర లాంఛనాల విషయంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అలోక్ రంజన్ తెలియజేశారు. ఆయన వెంట నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్. సంజీవ్ శరణ్ తదితరులు ఉన్నారు.