ఇక జాయ్ రైడ్
సాక్షి, న్యూఢిల్లీ : నగరవాసులకు శుభవార్త. ఐదు సంవత్సరాల క్రితం నగరంలో నిర్మించిన జెయింట్ వీల్ ఢిల్లీ ఐ గురువారం ప్రారంభం కానుంది. దీని ఎత్తు 200 అడుగులు. ఢిల్లీ ఐ పైనుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నగరాన్ని అవలీలగా తిలకించొచ్చు. ఓఖ్లా ప్రాంతంలో కాళిందీకుంజ్ పక్కన ఏర్పాటుచేసిన ఈ జెయింట్ వీల్ నుంచి లోటస్ టెంపుల్, అక్షర్ధామ్ మందిర్. కుతుబ్‌మినార్ కనిపిస్తాయని అంటున్నారు.
సింగపూర్ ఫ్లైఓవర్‌ను నిర్మించిన డంచ్ వీల్స్ అండ్ వెంకోమా రైడ్స్ కంపెనీయే దీనిని కూడా 2010లో నిర్మించింది. అయితే్ర పారంభోత్సవానికి ముందే ఇది వివాదంలో చిక్కుకుంది. యమునా నదికి ఇరువైపులా ఆక్రమణలను పర్యవేక్షించేందుకు కోర్టు నియమించిన కమిటీ దీనిని అక్రమ కట్టడంగా పేర్కొంది. ఢిల్లీ ఐ నదికి 300 మీటర్లలోపు ఉందని, నదికి ఇరువైపులా 300 మీటర్ల లోగా ఎలాంటి కట్టడం నిర్మించరాదనే నియమాన్ని ఇది ఉల్లంఘించిందని కమిటీ పేర్కొంది.
రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ జెయింట్ వీల్‌కు ఇప్పుడు అవసరమైన అనుమతులన్నీ లభించాయి. దీంతో ఐజారా కంపెనీ ఇప్పుడు దానిని నడపనుంది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఢిల్లీ ఐ గంటకు 70 కి.మీల గరిష్ట వేగంతో తిరుగుతుంది. దీనిని గంటకు ఐదు కి.మీల వేగంతో నడుపుతారు.
ఢిల్లీ ఐ లో 36 ఎయిర్కండిషన్డ్ కేబిన్లు ఉన్నాయి. ప్రతి కేబిన్‌లో ఆరు నుంచి ఎనిమిది మంది కూర్చోవచ్చు. ఒకసారి 288 మంది ఈ జాయ్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు. దీని టికెట్ ధరను రూ. 300లుగా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద కొద్దిరోజులపాటు రూ.250 కే జాయ్‌రైడ్‌ను ఆనందించవచ్చు. మూడు సంవత్సరాలలోపు వారికి ప్రవేశం ఉచితం. 20 నిమిసాల పాటు కొనసాగే ఒక జాయ్‌రైడ్‌లో నాలుగు రౌండ్లు ఉంటాయి.