ఎయిర్ ఇండియా రికార్డు
భారత ప్రభుత్వ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా రికార్డు సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కోకు నాన్ స్టాప్ ఫ్లైటును నడుపుతున్న ఏకైక సంస్ధగా రికార్డు బుక్ లలో చేరింది. ఈ నెల 16వ తేదీన ఉదయం నాలుగు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 15,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకు 14గంటల 30 నిమిషాల్లో చేరుకుందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు.
ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లేప్పుడు పసిఫిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణించే విమానం.. తిరుగు ప్రయాణంలో అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది. గతంలో వెళ్లడానికి రావడానికి ఒకే మార్గం( అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా) 14 వేల కిలోమీటర్లు ప్రయాణించడానికి వినియోగించినా గాలి వేగం ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రయాణ మార్గాన్ని మార్చారు. ప్రయాణ మార్గంలో మార్పుల కారణంగా వెళ్లి వచ్చే మార్గాల్లో గాలి వాలును విమానానికి అనుకూలంగా వినియోగించవచ్చని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
రెండేళ్ల వరకు మాత్రమే అతిపెద్ద నాన్ స్టాప్ విమానాన్ని నడుపుతున్న సంస్ధగా ఎయిర్ ఇండియా పేరు నిలవనుందని ఓ విదేశీ పత్రిక తెలిపింది. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రారంభించే సింగపూర్-న్యూయార్క్ సర్వీసు 16,500కిలోమీటర్ల దూరాన్ని 19 గంటల్లో చేరుకోనుందని చెప్పింది.