మోదీ టీమ్‌లోకి కొత్త ఆర్థిక సలహాదారు..
అరవింద్ సుబ్రమణియన్‌కు బాధ్యతలు
ఆర్థికశాఖలో తాజా నియామకాలు...
పర్యాటక శాఖకు ఆర్థిక కార్యదర్శి మయారామ్
ఆయన స్థానంలో రాజీవ్ మహర్షి
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కీలక నియామకం జరిగింది. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) ప్రముఖ ఆర్థికవేత్త, ప్రపంచ స్థాయి ఆర్థిక విద్యావేత్త అరవింద్ సుబ్రమణియన్ కొలువుదీరారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభావితం చేసే ఈ పదవికి ఆయన పేరు వెల్లడైన గురువారంనాడే బాధ్యతలు స్వీకరించడం విశేషం.
తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక రంగంలో అరవింద్ సుబ్రమణియన్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. సుబ్రమణియన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఈఏగా మూడేళ్లు బాధ్యతలు నిర్వహిస్తారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారు ప్రవేశపెట్టబోయే తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపొందిస్తున్న తరుణంలో కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారు నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు అరవింద్ సన్నిహితుడని బ్యూరోక్రాట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిరువురూ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లో కలసి పనిచేశారు. ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి అరవింద్‌ను నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఎంపిక చేశారని వినికిడి.
గర్వకారణం: అరవింద్
బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుబ్రమణియన్ విలేకరులతో మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం ధ్యేయమని అన్నారు. కీలక బాధ్యతల్లో నియామకం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. దేశాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. సంస్కరణలకు, మార్పునకు ప్రజలు అధికారమిచ్చిన ప్రభుత్వంలోని కీలక ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వహించడం దేశానికి సేవ చేయడానికి అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. పలు సవాళ్లు ఉన్నప్పటికీ దేశానికి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉజ్వల భవిత ఉందని వివరించారు.
అపార అనుభవం.. సుబ్రమణియన్ సొంతం
ఆర్బీఐ గవర్నర్ రాజన్ తరహాలోనే అరవింద్ ఐఐఎం అహ్మదాబాద్, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో పూర్వ విద్యార్థి. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఆయన... ఆక్స్‌ఫర్డ్‌లోనూ విద్యను అభ్యసించారు. ఐఎంఎఫ్‌లో ఆర్థిక వేత్తగా బాధ్యతలను నిర్వహించారు. భారత్, చైనా, ఆఫ్రికాల ఆర్థికరంగాలుసహా పలు అంతర్జాతీయ ఆర్థికాంశాలపై సుబ్రమణియన్ పుస్తకాలను రాశారు. ఆయా అంశాల్లో వృద్ధి, వాణిజ్యం, అభివృద్ధి, ఆర్థిక సంస్థలు, ఆర్థిక సహాయ సహకారాలు, వాతావరణంలో మార్పులు, చమురు, మేధో హక్కులు, ప్రపంచ వాణిజ్య సంస్థ కార్యకలాపాలు, బాధ్యతలు వంటివి ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు రఘురామ్ రాజన్ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అటు తర్వాత ఈ స్థానం ఇప్పటి వరకూ భర్తీ కాలేదు. తాజాగా ఈ స్థానంలో నియమితులైన సుబ్రమణియన్ నియమితులయ్యారు. పరిశోధన, అధ్యయనం వంటి ప్రపంచస్థాయి విద్యావేత్తలు, ర్యాంకింగ్స్(ఆర్ఈపీఈసీ) తొలి వరుసలో అరవింద్ సుబ్రమణియన్ది ప్రముఖ స్థానం. అమెరికా ఆర్థికరంగంపై సమీక్షలు, విశ్లేషణా పత్రాలు, అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి విధాన పరిశోధనా పత్రాలు, పలు జర్నల్స్, విద్యా సంబంధ గ్రంథాల్లో ప్రచురితమయ్యాయి.
ఆర్థిక రంగానికి సంబంధించి స్వయంగా ఆయన ఐదు పుస్తకాలను రచించారు. భారత్-అమెరికా సంబంధాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ఈ సంవత్సరాంతంలో ప్రచురణ కానుంది. కాగా, గతంలో భారత్ ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో సలహాలను అందించిన సుబ్రమణియన్, జీ-20పై ఆర్థిక మంత్రికి సంబంధించిన నిపుణుల బృందంలో సభ్యులుగా పనిచేశారు.
ఆర్థిక కార్యదర్శి రాజీవ్ మహర్షి...
ప్రధాన ఆర్థిక సలహాదారు నియామకంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఇప్పటి వరకూ ఆర్థిక కార్యదర్శిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అరవింద్ మయారామ్, ప్రాధాన్యత తక్కువగా వుండే పర్యాటక మం త్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. మయారామ్ స్థానంలో కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మహర్షి నియమితులయ్యారు. మహర్షి పదవీకాలం ఇంకా 10 నెలలు మాత్రమే ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖలోని నాలుగు విభాగాల (ఆర్థిక వ్యవహారాలు, వ్యయాలు, రాబడి, ఫైనాన్షియల్ సేవలు)కు చెందిన కార్యదర్శుల్లో మయారామ్ అత్యంత సీనియర్. గత యూపీఏ ప్రభుత్వం ఆయనను ఈ బాధ్యతల్లో నియమించింది. గురువారం మొత్తంమీద ఆర్థిక మంత్రిత్వశాఖలో 20 నియామకాలు జరిగితే, అందులో మూడవవంతు సెక్రటరీ స్థాయిలోనివే.