తాగేసి.. పోలీసును చితకబాదేశాడు!
అతడో రిక్షా కార్మికుడు. అతడికి బాగా మద్యం తాగే అలవాటుంది. తూర్పు ఢిల్లీ నడి వీధుల్లో అలాగే పూటుగా మద్యం తాగి వెళ్తూ.. మహిళలను దుర్భాషలాడుతుండగా ఓ ట్రాఫిక్ పోలీసు అతడిని చూశాడు. ఆపేందుకు ప్రయత్నించాడు.. అంతే, రిక్షా కార్మికుడికి ఎక్కడలేని కోపం వచ్చింది.
గతంలో తనను ట్రాఫిక్ పోలీసులు ఆపి వేధించిన విషయాలు ఏవైనా గుర్తుకొచ్చాయో ఏమో గానీ, ఇప్పుడు తనను ఆపిన కానిస్టేబుల్ను పట్టుకుని చితక బాదేశాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని మధువిహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి రిక్షా కార్మికుడిని అరెస్టు చేశారు. అయితే, తన పేరు చెప్పే పరిస్థితిలో గానీ, వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో గానీ అతగాడు లేడట!