delimitation commission
-
తెలంగాణలో మరోసారి తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడంతో పాటు ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లలోనూ మార్పు చేర్పులు ఉంటాయా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐదు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్) ఉండేవి. వాటిలో 18 సర్కిళ్లు ఉండేవి. 18 సర్కిళ్లను తొలుత 24 సర్కిళ్లుగా మార్చారు. తర్వాత వాటిని 30 సర్కిళ్లుగా చేశారు. ఐదు జోన్లను ఆరు జోన్లుగా మార్చారు. ఆరు జోన్లకు చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లుగా పేర్లు పెట్టారు. 12 జోన్లు.. 48 సర్కిళ్లు.. పరిపాలన సౌలభ్యం కోసమంటూ గత ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచినట్లే జీహెచ్ఎంసీ జోన్లను సైతం 12 జోన్లుగా చేయాలని.. ఒక్కో జోన్లో నాలుగు సర్కిళ్ల వంతున 48 సర్కిళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఆమేరకు జీఓ కూడా వెలువడింది. కానీ.. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. జోన్లను పదికి, సర్కిళ్లను యాభైకి పెంచాలని 2018లో స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించగా, 12 జోన్లు.. 48 సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం జీఓ వెలువరించింది. కానీ అంతకుముందే ఏర్పాటైన ఆరు జోన్లే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాల పునరి్వభజన తెరపైకి రావడంతో జీహెచ్ఎంసీలోనూ జోన్లు, సర్కిళ్లు మారతాయా అనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ప్రస్తుతమున్న సర్కిళ్లు, జోన్లలో సమస్యలున్నాయి. ఖైరతాబాద్ జోన్ షేక్‌పేట దాకా విస్తరించి ఉంది. శేరిలింగంపల్లి ఒకే జిల్లా పరిధిలో లేదు. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. గతంలో ఇలా.. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిని 12 జోన్ల పరిధిలోకి తేవాలని భావించారు. ఒక్కో జోన్లో రెండు నియోజకవర్గాలు, నాలుగు సర్కిళ్లు ఉండేలా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా జీవో జారీ చేశారు. ఆమేరకు కమిషనర్‌ను ఆదేశించారు. కానీ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోనూ మార్పుచేర్పులు జరగవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ బాధ్యతలు కమిషనర్‌కు.. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు జిల్లాలున్నాయి. అన్ని జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కలెక్టర్లది కాగా హైదరాబాద్ జిల్లాది మాత్రం కమిషనర్‌కు అప్పగించారు. దీంతో ఎన్నికలొచ్చినా ప్రతిసారీ జీహెచ్ఎంసీలో పనులు నిలిచిపోతున్నాయి. కోటిమందికి పైగా సేవలందించే జీహెచ్ఎంసీ కమిషనర్‌కు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలున్నాయి. గ్రేటర్ పరిధిలోనే ఉన్న ఒక జిల్లాలో ఐదు నియోజకవర్గాలుంటే, ఒక జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఒక ఎమ్మెల్యే పరిధిలో తక్కువ వార్డులుంటే.. మరో ఎమ్మెల్యే పరిధిలో ఎక్కువ వార్డులున్నాయి. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలున్నాయి. దీంతో నియోజకవర్గాలతో పాటే జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్లు, వార్డుల్లోనూ మార్పుచేర్పులుంటాయా ? అనేది చర్చనీయాంశంగా మారింది. -
డీలిమిటేషన్‌ను సవాలుచేస్తూ దాఖలైన పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
Jammu Kashmir: కేంద్రానికి భారీ ఊరట
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రత్యేక కమిటీ ద్వారా నియోజకవర్గాల సంఖ్య పెంపు, సరిహద్దులు మార్పులు చేయడంపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ప్రతిపక్షాల తరపున దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ (సోమవారం) కొట్టేసింది. జమ్ము కశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల హద్దులను తిరగరాసింది డీలిమిటేషన్ కమిషన్. అయితే ఈ చర్య బీజేపీకి లాభం చేకూర్చేదిగా ఉందంటూ శ్రీనగర్‌కు చెందిన స్థానిక నేతలు హాజీ అబ్దుల్ ఘనీ ఖాన్, ముహమ్మద్ అయూబ్ మట్టో.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019లో పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా.. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో పాటు ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అయితే కిందటి ఏడాది మే నెలలో జమ్ము అసెంబ్లీని 114 అసెంబ్లీ స్థానాలు(అందులో 24 పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు.. 43 జమ్ము రీజియన్‌కు, కశ్మీర్ లోయకు 47 సీట్లు..), కేటాయిస్తూ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలు చేసింది. అంతేకాదు.. పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ శరణార్థులకు, ఇద్దరు కశ్మీర్ వలసవాదులను సైతం అసెంబ్లీకి నామినేట్ చేయాలని డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సు చేసింది. అయితే.. 1971 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 2026 ఏడాది వరకు నియోజకవర్గాలను పునర్వర్థస్థీకరించడానికి వీల్లేదని, పైగా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత నియోజకవర్గాలను ఎలా మారుస్తారని.. కేంద్రంలోని బీజేపీది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని.. పిటిషన్‌దారులు సుప్రీం కోర్టులో వాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కశ్మీర్ ప్రత్యేక హోదాను జమ్ము కశ్మీర్ పునర్వవ్యస్థీకరణ చట్టం-2019 ప్రకారమే నిజయోకవర్గాల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వాదించింది. దీంతో కేంద్రం వాదనతోనే ఏకీభవించింది సుప్రీం కోర్టు. ఈ ఏడాదిలో.. కుదరకుంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్ము కశ్మీర్‌కు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. -
గుప్కార్ నేతల గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలకు నిరసనగా ర్యాలీ తలపెట్టిన ముగ్గురు మాజీ సీఎంలు సహా గుప్కార్ కూటమి రాజకీయ నేతలను పోలీసులు శనివారం గృహనిర్బంధంలో ఉంచారు. ‘గుడ్‌మార్నింగ్, 2022కు స్వాగతం. సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలకు భయపడిన జమ్మూకశ్మీర్ పోలీసులు చట్టవిరుద్ధంగా మళ్లీ ప్రజలను గృహనిర్బంధం చేశారు’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం ట్విట్టర్లో పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ ఇంటి లోపలి గేటును పోలీసులు మూసివేశారన్నారు. మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని పోలీసులు నిర్బంధంలో ఉంచారు. -
జమ్మూలో 6..కశ్మీర్లో 1
న్యూఢిల్లీ: జమ్మూ ప్రాంతంలో అదనంగా ఆరు నియోజకవర్గాలు, కశ్మీర్ ప్రాంతంలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రతిపాదించింది. ఎస్సీలు, ఎస్టీలకు 16 నియోజకవర్గాలను రిజర్వు చేసింది. ప్రస్తుతం కశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 37 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి చెందిన 24 అసెంబ్లీ స్థానాలు కశ్మీర్ అసెంబ్లీలో ఖాళీగానే కొనసాగుతాయి. జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ తదితర పార్టీలతోపాటు బీజేపీ మిత్రపక్షం పీపుల్స్ కాన్ఫరెన్స్ కూడా తీవ్ర నిరసన తెలిపాయి. ఈ సిఫారసులను బీజేపీ రాజకీయ ఎజెండాగా నేషనల్ కాన్ఫరెన్స్ అభివర్ణించింది. 2019 ఆగస్ట్‌లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, 2020 ఫిబ్రవరిలో పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు అసోసియేట్ సభ్యులుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. సోమవారం జరిగిన కమిషన్ మొట్టమొదటి సమావేశానికి ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా బీజేపీ ఎంపీలు ఇద్దరు హాజరయ్యారు. ఈ ప్రతిపాదనలపై ఆయా పార్టీలు డిసెంబర్ 31వ తేదీలోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. గుప్కార్ డిక్లరేషన్‌లో భాగమైన ఐదు పార్టీల నేతలతో చర్చించాకే ఈ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రతిపాదనలను అంగీకరించం ఈ ప్రతిపాదనలు నిరుత్సాహాన్ని కలిగిం చాయని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ప్రతిపాదనల కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన కమిషన్.. బీజేపీ రాజకీయ అజెండాను ముందుకు తీసుకురావడానికే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. శాస్త్రీయ విధానాలకు బదులు రాజకీయ ఉద్దేశాలతోనే ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు. 2011 జనగణన వివరాలను ఆధారంగా తీసుకోలేదు. వీటిని మేం అంగీకరించం’అని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై సంతకం పెట్టేది లేదని ఎన్సీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ప్రజలను మత, ప్రాంతాల వారీగా విభజించేందుకు, బీజేపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దుయ్యబట్టారు. -
పునర్విభజన కమిటీలోకి ఎంపీలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ అసోసియేట్ సభ్యులుగా 15 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిరేన్ రిజిజు, జితేంద్ర సింగ్ సైతం ఉన్నారు. 26న వెలువడిన లోక్‌సభ బులెటిన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌కు కిరేన్ రిజిజు, తపిర్ గావో ప్రాతినిధ్యం వహిస్తారు. అస్సాంకు పల్లవ్ లోచన్ దాస్, అబ్దుల్ ఖలేక్, రాజ్‌దీప్ రాయ్, దిలీప్ సైకియా, నబ సరానియా, మణిపూర్‌కు లోర్హో ఫోజ్, రంజన్ రాజ్‌కుమార్, నాగాలాండ్‌కు టోఖెహో యెఫ్తోమి ప్రాతినిధ్యం వహిస్తారు. జమ్మూకశ్మీర్‌కు ఫరూక్ అబ్దుల్లా, మొహమ్మద్ అబ్దుల్ లోనె, హస్నైన్ మసూదీ, జుగల్ కిశోర్ శర్మ, జితేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో కేంద్రం మార్చి 6న పునర్ విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఎక్స్–అఫీషియో సభ్యులుగా ఉంటారు. పునర్విభజన చట్టం2002, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జమ్మూకశ్మీర్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వీరు పాలుపంచుకుంటారు. -
ఈశాన్య ఢిల్లీ ఎన్నికల చిత్రం కాంగ్రెస్ వ్యతిరేక పవనాల జోరు
అనుభవం, నిరాడంబరత, స్థానికుల్లో మంచి పేరున్నా ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైప్రకాశ్ అగర్వాల్ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తుండడమే. ఇదే బీజేపీ అభ్యర్థి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ గెలుపు అవకాశాలను మెరుగుపర్చవచ్చంటున్నారు. ఇక ఆప్ అభ్యర్థి ఆనంద్‌కుమార్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై కొంతమేర ప్రభావం చూపవచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం 2008లో డీలిమిటేషన్ కమిషన్ సిఫారసు మేరకు ఏర్పాటైంది. ఈస్ట్ ఢిల్లీ నియోజవర్గంలోని ప్రాంంతాలతో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2009లో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు చెందిన జైప్రకాశ్ అగర్వాల్, బీజేపీకి చెందిన బి.ఎల్. శర్మ ప్రేమ్‌ను 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. అయితే కొత్తగా ఢిల్లీ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి జేఎన్‌యూ ప్రొఫెసర్ అనంద్కుమార్ను అభ్యర్థిగా నిలబెట్టింది. సమాజశాస్త్ర నిపుణుడిగా ఆనంద్‌కుమార్‌కు విద్యారంగంలో మంచి పేరుంది. ఆయన ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, ఆప్ జాతీయ కార్యవర్గంలోనూ సభ్యుడు. అయితే సైద్ధాంతిక ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞుడైన ఆనంద్‌కుమార్ ఈశాన్య ఢిల్లీలోని కుల, మత రాజకీయాలలోఎలా నెట్టుకురాగలరన్న సందేహం ఆప్ కార్యకర్తలను వేధిస్తోంది. అదీకాక బయటి వ్యక్తిని లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని కొందరు స్థానిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఆనంద్‌కుమార్‌కు రాజకీయాలలో అనుభవం లేకపోవడం కూడా ఆప్ విజయానికి ప్రతికూలాంశమని అంటున్నారు. అయితే నిజాయితీపరుడన్న పేరు, ఆమ్ ఆద్మీ పార్టీ పాపులారిటీ ఆనంద్‌కుమార్‌ను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజవర్గం ఇదే. ఇక్కడి ఓటర్లలో 27 శాతం మంది ముస్లింలున్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నందున ఇక్కడి నుంచి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కానీ పార్టీ వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్‌కు టికెట్ ఇచ్చింది. ఆయన అభ్యర్థిత్వం ప్రైమరీ ఎన్నికల ద్వారా ఖరారైంది. కాంగ్రెస్ ఢిల్లీలో ప్రైమరీ ఎన్నికల ద్వారా అభ్యర్థులను ఖరారు చేసిన రెండు నియోజకవర్గాలలో ఇదొకటి. జేపీ అగర్వాల్ సరళస్వభావం, నిరాడంబరత, అనుభవం ఈశాన్య ఢిల్లీ ఓటర్లకు నచ్చినప్పటికీ నగరంలో తీవ్రంగా వీస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు, స్థానిక సమస్యలు ఆయన విజయానికి అడ్డంకిగా మారవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో అనధికార కాలనీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గం మిగతా ఢిల్లీ నుంచి దూరంగా ఉన్నట్లు ఉంటుంది. మెట్రో సదుపాయం లేదు. ఇతర ప్రజారవాణా సదుపాయాల లభ్యత కూడా తక్కువే. బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతం దేశమంతటా రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని, మైనారిటీల ఓట్లు దక్కకపోయినా పూర్వాంచలీయుల ఓటర్లను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆపార్టీ భోజ్‌పురి గాయకుడు, నటుడు మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చింది. ఈ నియోజవర్గం జనాభాలో 45 శాతం మంది పూర్వాంచలీయులున్నారు. పూర్వాంచలీ ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బయటివాడన్న వ్యతిరేకతను ఖాతరు చేయకుండా ఆనంద్‌కుమార్‌కు టికెట్ ఇచ్చిందని కొందరు రాజకీయ పండితులు అంటున్నారు. ఆనంద్‌కుమార్ వారణాసిలో జన్మించారని, ఆయన కొంతకాలం బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా పనిచేశారని వారు అంటున్నారు. ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని హజ్ కమిటీ సభ్యుడు సమీ సల్మానీకి బీఎస్పీ టికెట్ ఇచ్చింది. బురాడీ, తిమార్పుర్, సీమాపురి, రోహతాస్‌నగర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకుల్పూర్, ముస్తఫాబాద్, కరావల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధి కిందకు వస్తాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఈ పది నియోజకవర్గాలలో ఐదింటిలో బీజేపీ, మూడింటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, రెండింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది.