10 లక్షల మంది విద్యార్థుల వద్దకు డెల్ ఆరంభ్
♦ పీసీ ఆవశ్యకతపై అవగాహన
♦ డెల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డెల్ ఆరంభ్ పేరుతో భారీ కార్యక్రమానికి భారత్‌లో శ్రీకారం చుట్టింది. పర్సనల్ కంప్యూటర్ (పీసీ) వాడకం వల్ల విద్యార్థులకు ఒనగూరే ప్రయోజనాలను తెలియజేయడమే ఈ కార్యక్రమ ఉద్ధేశం. ఇందులో భాగంగా 2016లో దేశవ్యాప్తంగా 75 చిన్న పట్టణాల్లోని 5,000 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 లక్ష మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులకు డెల్ అవగాహన కల్పిస్తుంది. ఆరంభ్ ద్వారా 10 లక్షల మంది విద్యార్థులను చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. పీసీ ద్వారా మరింత ఉత్తమంగా బోధన ఎలా చేయవచ్చో ఉపాధ్యాయులకు కంపెనీ శిక్షణ ఇస్తుంది. వీరు పిల్లల తల్లిదండ్రులకు పీసీ వాడకం, ఉపయోగాలపై అవగాహన కల్పిస్తారని డెల్ ఇండియా కంజ్యూమర్, స్మాల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ పి.కృష్ణకుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.
రెండేళ్లలో 14 శాతానికి..
పీసీ విస్తరణ భారత్‌లో ప్రస్తుతం 9-10 శాతానికే పరిమితమైంది. అదే బ్రెజిల్లో 60 శాతం, చైనాలో 40 శాతం, పొరుగున ఉన్న చిన్న దేశమైన శ్రీలంకలో 12 శాతం గృహాల్లో పీసీలు ఉన్నాయి. భారత్‌లో అధిక జనాభా ఉన్నప్పటికీ పీసీల వాడకం చాలా తక్కువగా ఉందని కృష్ణకుమార్ వ్యాఖ్యానించారు. నెట్వర్క్/బ్రాడ్‌బ్యాండ్ పరిమితంగా ఉంది. ఇది పూర్తి స్థాయిలో విస్తరిస్తే పీసీ వినియోగం అధికమవుతుంది. ఇంటర్నెట్ను తొలిసారిగా మొబైల్లోనే ఆస్వాదిస్తున్నారు. అయితే కంటెంట్ సృష్టించాలంటే మాత్రం పీసీ ఉండాల్సిందే. జనాభాలో 43 శాతం విద్యార్థులున్నారు. పీసీ ప్రయోజనాలను వీరికి వివరిస్తాం. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేక వాయిదా స్కీమ్ ద్వారా పీసీలను విక్రయిస్తామని ఆయన చెప్పారు.