రెట్టింపు ఇస్తే ఓకే
మన కథానాయికల ఆలోచనలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే కొందరు పేరు వచ్చిన తరువాత పారితోషికం పెంచుకునే పనిలోనే ఉంటారు. మరికొందరు మంచి కథా చిత్రం అయితే పారితోషికం విషయంలో పెద్దగా డిమాండ్ చేయరు. నయనతార, కాజల్ అగర్వాల్ లాంటి వారు మొదటికోవకు చెందినవారే. ప్రముఖ హీరో సరసన నటించినా, చిన్న హీరోకు జతగా నటించినా పారితోషికం విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదనే టాక్ ఉంది. తమన్నా వీరికి కొంచెం భిన్నం అనే పేరుంది. మంచి అవకాశం అనుకుంటే పారితోషికం విషయంలో కాస్త పట్టువిడుపునకు ఆస్కారం ఇస్తుందంటారు.
అయితే ఈ అమ్మడు తమిళంలో చేసింది చాలా తక్కువ చిత్రాలే. అదే విధంగా పెద్ద హీరోలంటే ఆ మధ్య సూర్యతో అయన్, ఆ తరువాత అజిత్‌తో వీరం చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు విజయం సాధించడం విశేషం. అయితే ఆ తరువాత అమ్మడికి ఇక్కడ అవకాశాలు లేవు. ఆ మధ్య బాలీవుడ్ రంగ ప్రవేశం కూడా చేశారు. తొలి చిత్రం హిమ్మత్వాలా, మలి చిత్రం హమ్షకర్స్ రెండూ నిరాశనే మిగిల్చాయి. దీంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ హిందీలో నటించిన మూడో చిత్రం ఎంటర్టైన్మెంట్ చిత్రం పర్వాలేదనిపించుకుని తమన్నలో కాస్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఈ జాణ ప్రవర్తనలో మార్పు వచ్చిందట. అధిక పారితోషికం డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారట.
వీరం తరువాత కోలీవుడ్‌లో అవకాశాల్లేని తమన్నాకు అంతకుముందు పైయ్యా చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లింగుస్వామి తాజాగా శివకార్తికేయన్‌తో నిర్మించనున్న రజని మురుగన్ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం కల్పించారు. తమన్న కూడా వెంటనే నటించడానికి అంగీకరించారు. అయితే హిందీ చిత్రం ఎంటర్టైన్మెంట్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో, ముందు ఒప్పుకున్న పారితోషికానికి రెట్టింపు కావాలని డిమాండ్ చేస్తోందట. దీంతో ఈ అమ్మడు కూడా నయనతార, కాజల్ బాటలోనే పయనిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే దర్శకుడు లింగుస్వామి తరపు నుంచి మాత్రం తమన్నాతో ఇప్పటికీ పారితోషికం విషయంలో చర్చలు జరుపుతున్నారని సమాచారం. తమ బడ్జెట్‌కు తగ్గట్టు పారితోషికానికి అంగీకరిస్తే తమన్నా ఉంటుంది లేదంటే మరో నాయికను ఎంపిక చేస్తా అంటున్నారు దర్శకుడు లింగుస్వామి వర్గం.