చరిత్రకారుడు ‘దెందులూరి’ కన్నుమూత
హన్మకొండ కల్చరల్: కాకతీయుల చరిత్రను ఔపోసన పట్టిన మేధావిగా, గొప్ప వ్యాఖ్యాతగా జిల్లాను ప్రముఖులు సందర్శించిన సమయంలో చరిత్ర-శిల్పకళారీతులను వివరించే గైడ్‌గా సుపరిచితులైన దెందులూరి సోమేశ్వర్రావు శనివారం సాయంత్రం కన్నుమూశారు. 92 ఏళ్ల సోమేశ్వర్రావు హన్మకొండలోని కిషన్‌పురలో ఉంటుండగా, అక్కడే కన్నుమూశారు. ఆయనకు నలుగురు కుమారులు. భార్య సుశీలాదేవి 2010లో మరణించారు. 1924 మే 31వ తేదీన హన్మకొండలోని లష్కర్‌బజార్‌లో వెంకటసుబ్బమ్మ, వెంకటసుబ్బయ్య దంపతులకు సోమేశ్వరరావు జన్మించారు. ప్రభుత్వ టీచర్, ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. తెలుగు, ఉర్ధూ, పర్షియన్, ఇంగ్లిష్, సంసృ్కత భాషలలో ప్రావీణ్యం సంపాదించారు.
జ్యోతిష్యవాస్తుశాస్త్రాలలో కూడా నిష్ణాతులు. కేసీఆర్ రాజకీయగురువు మదన్మోహన్, మాడభూషిశ్రీధర్, ప్రభుత్వసలహాదారు పాపారావు, వి.ప్రకాశ్ తదితరులు ఎందరో ఆయన వద్దనే చదువుకున్నారు. 1974లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన రాసిన మనశిల్పకళాసంపద పుస్తకాన్ని ప్రభుత్వమే ప్రచురించింది. ఆయన సాహిత్య అకాడమి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇంటాక్ చిత్రకళాపరిషత్‌లలో శాశ్వతసభ్యులుగా ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లోగోను సోమేశ్వరరావు రూపొందించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు విద్యానాధ్ తెలిపారు.