డెంటల్ హెల్త్ ఉత్సవ్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా నగరంలో సోమవారం డెంటల్ హెల్త్ ఉత్సవ్ -2014ను ప్రారంభించారు. దీంతోపాటు మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ రెండోదశకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి డా. హర్షవర్ధన్‌తో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి నడ్డా మాట్లాడుతూనోటి ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యంలో అంతర్భాగమని పేర్కొన్నారు. దంతవ్యాధులు నివారించగలిగినవే అయినప్పటికీ నోటి ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన లేనందువల్ల, నిర్లక్ష్యం వల్ల అవి వ్యాపిస్తున్నాయని చెప్పారు.
దంత వైద్య సేవలపై దేశవాసులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులోభాగంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. దేశ ప్రజల దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఎం తైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ డెంటల్ ఇంప్లాంట్స్‌ను డిజైన్ చేసి తయారు చేయడంలో మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు.