గాడిన పడని జిల్లా విద్యావ్యవస్థ
బాధ్యతలు చేపట్టి నెలరోజులు దాటినా కార్యాలయం దాటని డీఈఓ నజీమొద్దీన్
సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లా విద్యాశాఖ అధికారిగా నజీమొద్దీన్ నెలరోజుల క్రితం బాధ్యతలు చేపట్టినా జిల్లాలోని విద్యావ్యవస్థ ఇంకా గాడిన పడలేదు. ఇంతవరకు ఆయన జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలను కూడా తనిఖీ చేయలేదు. దీంతో ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పలు పాఠశాలల్లో విద్యారు ్థలు వ చ్చినా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఉదయం పూట ప్రార్థనలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
జిల్లాలో పనిచేస్తున్న విద్యాశాఖ అధికారులను వివిధ కారణాలను సాకుగా చూపి, సంఘాల నాయకుల పైరవీలు, రాజ కీయ వత్తిళ్లు తెచ్చి బదిలీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ బదిలీల్లో జరిగిన అక్రమాలకు బాధ్యుడిగా చేస్తూ రాజేశ్వర్రావును గత నెల 3న ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీఆర్టీ విభాగంలో అసిస్టెంట్ డెరైక్టర్ గా పనిచేస్తున్న నజీమొద్దీన్ను డీఈఓ గా నియమించారు. విధిలేని పరిస్థితిలోనే తాను బాధ్యతలు తీసుకుంటున్నానని, ఎంతకాలం పనిచేస్తాననేది మాత్రం తెలియదని ఆయన పేర్కొన్నారు. ఏడాది కాలంలో పదవీ విరమణ చేయాల్సిన తాను విమర్శలను ఎదుర్కోవడం కంటే కార్యాలయంలోనే ఉంటూ పర్యవేక్షిస్తే సరిపోతుందనే భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తొంది.
ఇప్పటి వరకు డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అధికారులు మరుసటి రోజు నుంచే పాఠశాలల తనిఖీలు చేపట్టేవారు. ప్రస్తుత డీఈఓ మాత్రం కనీసం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఉన్న పాఠశాలలను కూడా తనిఖీ చేయడంలేదు. జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బోధించడం కన్నా పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పాఠశాలకు సెలవు పెట్టి రావాల్సిన ఉపాధ్యాయులు మరుసటి రోజున వెళ్లి సంతకాలు చేసి వస్తున్నట్లు తెలుస్తోంది.
కలెక్టర్గారూ మీరైన దృష్టి పెట్టండి..
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్ రాస్ వారం రోజుల్లోనే వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై వేటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలపై దృష్టిసారిస్తే ప్రభుత్వ పాఠశాలల పనితీరు కొంతమేరకైనా మెరుగుపడే అవకాశం ఉంటుంది.
డీఈఓ వివరణ ..
పాఠశాలలను తనిఖీలు చేయకుండా కార్యాలయానికే పరిమితమయ్యారన్న విషయంపై డీఈఓను వివరణ కోరగా తాను జిల్లాపై అవగాహన పెంపొందించుకుంటున్నానని, వారం పది రోజుల్లో తనిఖీలు చేపడతానని పేర్కొన్నారు.