at deo office
-
‘చైనా’తో సర్కారు బడులు నిర్వీర్యం!
– సర్కారుపై మండిపడుతున్న ఉపాధ్యాయలోకం – నేడు బదిలీల మార్గదర్శకాలపై డీఈఓ కార్యాలయాల ముట్టడి – 23న విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట మహాధర్నా కదిరి : ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్ మార్గదర్శకాలు ఉపాధ్యాయలోకాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సర్కారు బడులను పూర్తిగా నిర్వీర్యం చేసి, చైతన్య, నారాయణ (చైనా) వంటి కార్పొరేట్ పాఠశాలల బలోపేతం దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని మండిపడుతోంది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ‘నారాయణ విద్యాసంస్థల’ అధినేత మంత్రి నారాయణలు ఇద్దరూ వియ్యంకులు కావడంతో ప్రభుత్వ పాఠశాలలను మూతపడేలా చేస్తున్నారని ధ్వజమెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ బదిలీల్లో ప్రతిభ ఆధారిత పాయింట్లు పెట్టి పాఠశాల సీనియారిటీతో పాటు సర్వీస్‌లో కూడా సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్ని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. రేషనలైజేషన్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు దాదాపుగా మూత పడేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని అంటోంది. గతంలో ఉపాధ్యాయుల సీనియారిటీకి 50 శాతం, ప్రతిభ ఆధారితకు 50 శాతం ఉండేలా ఉత్తర్వులు జారీ చేశామని, ఇప్పుడు సర్వీసు సీనియారిటీకి 60 శాతం, మిగిలిన 40 శాతానికి మాత్రమే ప్రతిభ ఆధారిత పాయింట్లు ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం దీన్ని కూడా తప్పుబడుతున్నారు. అయితే వెబ్కౌన్సిలింగ్ను తప్పుబడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతిభ ఆధారిత పాయింట్లను మాత్రమే మెజార్టీ శాతం వ్యతిరేకిస్తున్నారు. కేవలం పాఠశాల సీనియారిటీ, సర్వీస్ సీనియారిటీల ఆధారంగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వారంటున్నారు. వీటన్నింటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనబాట పట్టారు. అందులో భాగంగా బుధవారం డీఈఓ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. 23న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నాకు ఉపాధ్యాయులు సిద్దమతున్నారు. ఇందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉపాధ్యాయులకు మద్దతుగా నిలవనుంది. ఉపాధ్యాయులకు అన్యాయం చేసే అంశాలు మచ్చుకు కొన్ని... - 10 నుంచి 20శాతం విద్యార్థుల నమోదుకు పాయింట్లు కేటాయించారు. 100 మంది పిల్లలున్న పాఠశాలలో 20 శాతం అదనంగా చేర్చాలంటే 20 మందిని చేర్చాలి. అదే 10 మంది పిల్లలున్న పాఠశాలలో కేవలం ఇద్దరిని చేరిస్తే కూడా పూర్తి పాయింట్లు తీసుకుంటారు. - బాగా పాఠాలు చెప్పి నవోదయ, ఏపీ రెసిడెన్సియల్ వంటి పాఠశాలలకు ఎంపికయ్యేలా చేసిన ఉపాధ్యాయులకు పాయింట్లు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఈ ఎంపికైన విద్యార్థులు టీసీ తీసుకొని వెళ్తున్నారు కాబట్టి. కొన్ని గ్రామాల్లో వరుస కరువుల కారణంగా కూడా పిల్లల హాజరు శాతం తగ్గిపోతోంది. దీనికి కూడా ఉపాధ్యాయులే బాధ్యులవుతున్నారు. - ఒకే పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పాయింట్లు వస్తున్నాయి. 1వ తరగతి బోధించే వారికి ఒక్కో విధంగా మిగిలిన తరగతులు బోధించే వారికి ఇంకో విధంగా పాయింట్లు కేటాయిస్తున్నారు. - ప్రాథమికోన్నత పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో అక్కడున్న స్కూల్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. సబ్జెక్టు టీచర్లు లేని కారణంగా పిల్లలు‘నారాయణ’ బడి బాట పట్టక తప్పలేదు. - వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ ముగించి ఉంటే బడులు తెరుచుకోగానే విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగేది. ‘మీరు ఎలాగో వెళ్లిపోతారంట కదా..’ అంటూ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలలో చేర్పించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కాస్త ‘నారాయణ’ బాట పట్టింది. -
పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ధర్నా
ఏలూరు సిటీ : విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.దినేష్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా పిల్లల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో స్కూళ్లను మూసివేత నిర్ణయం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మూడు అంచెల పాఠశాల విధానానికి చరమగీతం పాడుతూ రెండు అంచెలకు తీసుకురావటం అనేది విద్యహక్కు చట్టాన్ని ఉల్లంఘించటమేనని తెలిపారు. పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట కుదిస్తే వేలాదిమంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్పొరేట్ విద్యాసంస్థలు లాభపడతాయని తెలిపారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు ఎం.దిలీప్, రాకేష్, ఏలూరు సిటీ నాయకులు పి.ప్రదీప్‌చంద్ర, ఎన్.నాగార్జున, ప్రకాష్, రాజేష్, ఎల్.సందీప్, ఎల్.ఆర్య, గణేష్ ఉన్నారు. -
సమస్యలు తీరే వరకూ పోరాడతాం
ఏలూరు సిటీ: ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదని, విద్యాధికారుల విధానాలకు వ్యతిరేకంగా 12 ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ ఎల్.విద్యాసాగర్ ప్రారంభించారు. శిబిరానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎల్వీ సాగర్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి తన వైఖరి మార్చుకుని తక్షణమే జిల్లా విద్యాశాఖలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేందుకు కృషి చేయాలని, లేకుంటే అతడ్ని సస్పెండ్ చేసేవరకూ రాష్ట్ర అధికారులు, నాయకుల దష్టికి ఈ విషయాలను తీసుకువెళతామని హెచ్చరించారు. ఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ హరనాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు భారమైన, స్కూల్æక్యాలెండర్లో లేని పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను ఎటువంటి బోధనేతర పనులకు ఉపయోగించకూడదని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ Sసాబ్జీ మాట్లాడుతూ డీఈవో వైఖరిపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతప్తితో ఉన్నారని చెప్పారు. దీక్షల్లో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ, యూటీఎఫ్ కోశాధికారి పీవీ నరసింహారావు, జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు వి.కనకదుర్గ, రాష్ట్ర కౌన్సిలర్ సుభానీబేగం, జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్, డి.పద్మావతి, టి.పూర్ణశ్రీ, ఆర్.కమలారాణి, ఎన్.వేళాంగిణి, సీహెచ్ మణిమాల పాల్గొన్నారు. దీక్షలకు ఆపస్ జిల్లా అధ్యక్షుడు రాజకుమార్, పీఆర్టీయూ నగర అధ్యక్షులు నెరుసు రాంబాబు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.నరహరి, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షులు జి.సుధీర్ తదితరులు మద్దతు తెలిపారు.