హృతిక్ Vs డికాప్రియో
ఇద్దరు అల్టిమేట్ సూపర్ స్టార్లలో ఎవరి నటన బాగుంటుందో తేల్చి చెప్పే వీలుంటుందా? ఎందుకుండదు.. ఆ ఇద్దరూ ఒకరి సినిమాలు మరొకరు రీమేక్ చేస్తే నటనలో ఎవరెంత ఘనాపాటో ఈజీగా చెప్పేయొచ్చని అంటారేమో! నిజమే.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు 'యాంగ్రీ యంగ్‌మ్యాన్' అనే బిరుదుతోపాటు సూపర్ స్టార్ హోదానూ తెచ్చిపెట్టిన 'అగ్నిపథ్' సినిమా రీమేక్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటించినప్పుడూ ఇలాంటి చర్చే జరిగింది. అఫ్ కోర్స్ 'అమిత్ జీకి నాకూ పోలికా? ఆయన ఆకాశమైతే నేను నేల' అని హృతిక్ రోషన్ స్వయంగా మీడియాతో అన్నాడు. ఆ సినిమా ఫలితాన్ని పక్కనపెడితే హృతిక్ తాజాగా మరో రీమేక్ కు పచ్చజండా ఊపాడు.
టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన 'ది డిపార్టెడ్' సినిమా రీమేక్ లో హృతిక్ నటించనున్నాడు. 2004లో నాలుగు అకాడమీ అవార్డుల్ని గెల్చుకున్న ఈ సినిమాను హిందీలో ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేయనున్నారు. సాజిద్ నదియావాలా నిర్మాతగా వ్యవహరిస్తారు. తర్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న డిపార్టెడ్ రీమేక్ వివరాలు తర్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. నిజానికి డిపార్టెడ్ సినిమా కూడా 'ఇన్ఫెర్నల్ అఫైర్స్' అనే హాంకాంగ్ సినిమాకు రీమేకే. తెలుగులో 'హోమం' పేరుతో జేడీ చక్రవర్తి, జగపతిబాబు నటించిన సినిమా 'ది డిపార్టెడ్'కు నకలే!