సేద్య స్వేదంలోనూ ఆమె సగం!
⇒ వ్యవసాయ యంత్ర పరికరాలపై మహిళా రైతులకు ఉచిత శిక్షణ
⇒ రైతులు, సాంకేతిక విద్యార్థులతోపాటు గ్రామీణ ఆవిష్కర్తలకూ అవకాశం
⇒ అనంతపురం జిల్లాలో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రాంతీయ శిక్షణా సంస్థ సేవలు
విత్తనం దగ్గరి నుంచి పంట కోత వరకు పొలంలో జరిగే ప్రతి పనిలోనూ మహిళా రైతుల చెమట చిందాల్సిందే. బురదలో రోజంతా నాట్లు వేసినా, కలుపు తీసినా, ప్రతి మొక్క పాదులో ఎరువులు వేసినా, ఒడుపుగా కోత కోసినా, నూర్పిడి చేసినా పంట సిరులను బస్తాలకు, గాదెలకు నింపే వరకు.. అంతేనా కోత అనంతర పనుల్లోనూ.. పంట దిగుబడుల నిండా గ్రామీణ మహిళా శ్రామికుల కాయకష్టం దాగి ఉంటుంది. మన దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి అన్నం ముద్దలోనూ, ప్రతి పండులోనూ, పితికే పాల చుక్కలోనూ అణువణువునా ఆమె అలుపెరగని శ్రమ నిక్షిప్తమయ్యే ఉంటుంది! ఇంత చేసినా ఆమెకు రైతుగా గుర్తింపే లేదు. అంతెందుకు.. చాకిరీని తగ్గించి, వ్యవసాయ పనిని సులభతరం చేసే పరికరాలు లేకపోలేదు. అయితే, ఆమె కోసమే తయారైన వ్యవసాయ పరికరాలకే కాదు.. అసలు అలాంటి అవసరం ఒకటి ఉందన్న స్పృహ కూడా అంతంత మాత్రంగానే ఉందంటే అతిశయోక్తి కాదు!!
గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. రైతులకు ఉపకరించే యంత్రాలు, పరికరాల ఎంపిక, వినియోగం, యాజమాన్యంపై శిక్షణనిచ్చే ప్రభుత్వ సంస్థ దక్షిణాదిలో 7 రాష్ట్రాలకు గాను ఒకటి ఉంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె(ట్రాక్టర్ నగర్)లోని 500 ఎకరాల్లో ఏర్పాటైన ఈ సంస్థ పేరు ‘దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ – పరీక్షణ సంస్థ’ (ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.టి.ఐ.). కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఇది పనిచేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తయారు చేసే వ్యవసాయ యంత్రాలు, యంత్ర పరికరాలను పరీక్షించి. వాటి బాగోగులను నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధృవీకరించే అధికారం ఉంది. ధృవీకరణ పొందిన వ్యవసాయ యంత్రాలు, పరికరాలకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ వస్తుంది. ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.టి.ఐ. డైరెక్టర్ డా. పి. పి. రావు ‘సాక్షి’తో చెప్పిన సమాచారం ఇదీ..
యంత్ర పరికరాలపై రైతుల కోసం 10 కోర్సులు..
వ్యవసాయ యంత్రాలు, యంత్ర పరికరాల వినియోగం, నిర్వహణపై మహిళా, పురుష రైతులకు ఉపయోగపడే 10 రకాల కోర్సులను ఎస్.ఆర్.ఎఫ్. ఎం.టి.టి.ఐ. సంస్థ నిర్వహిస్తున్నది. ఇందులో మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలపై 3 రోజుల ప్రత్యేక కోర్సు ఉంది. దీనితోపాటు.. పురుషులు లేదా మహిళా రైతులు ఎవరైనా శిక్షణ పొందడానికి అనువైన (వారం నుంచి 6 వారాల) కోర్సులు మరో 9 రకాలు ఉన్నాయి. ఇవి కాకుండా.. ఐటిఐ, ఒకేషనల్, వ్యవసాయ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివే (మహిళ, పురుష) విద్యార్థులకు శిక్షణా కోర్సులు ఉన్నాయి.
మహిళా రైతులకు 3 రోజుల శిక్షణ
వ్యవసాయ యంత్రాలు, పరికరాలను భయం లేకుండా, జాగ్రత్తగా వినియోగించడం, వాటి నిర్వహణలో మెళకువలను మహిళా రైతులకు నేర్పించేందుకు గార్లదిన్నెలోని ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.టి.ఐ. 3 రోజుల ప్రత్యేక ఉచిత శిక్షణా కోర్సును నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఆవరణలోనే ఉన్న హాస్టల్లోనే ఉండి శిక్షణ పొందవచ్చు. కనీసం 8వ తరగతి చదివి, 18 ఏళ్లు నిండిన మహిళా రైతులకు ఉద్దేశించిన శిక్షణా కార్యక్రమం ఇదొక్కటే.
మహిళా రైతులకు ఏయే అంశాలపై శిక్షణ ఇస్తారు?
నిలబడి సులువుగా కలుపు తీసే యంత్రపరికరాలు, వరినాట్లు వేసే యంత్రం, స్ప్రేయర్లు, వేరుశనగ విత్తనాలు ఒలిచే యంత్రం, విత్తనాన్ని శుద్ధిచేసే జల్లెడను వినియోగించడం, బస్తాలో ధాన్యం నింపేందుకు పట్టి ఉంచే పరికరం, మొక్కజొన్న/పొద్దుతిరుగుడు నూర్పిడి యంత్రాలు, కొబ్బరి చెట్ల పైకి సులభంగా ఎక్కడానికి వీలయ్యే పరికరం, టెంకాయ పీచు ఒలిచే యంత్రం, ఎరువులు చల్లే పరికరం, కాయలు సులువుగా కోసే పరికరం, బెండకాయలను కోసే పరికరం, ఉద్యాన తోటల్లో ఉపయోగించే పరికరాలు.. వంటి వాటిపై మహిళా రైతులకు తెలుగులోనే అనుభవజ్ఞులైన మహిళా ఇన్స్ట్రక్టర్లు శిక్షణ ఇస్తారు.
గ్రామీణ ఆవిష్కర్తలకూ అవకాశం..
మహిళా, పురుష రైతులతోపాటు వ్యవసాయ యంత్రాలు కలిగి ఉన్న వారు.. ఎటువంటి సాంకేతిక విద్య లేకపోయినా (కనీసం 8వ తరగతి చదివి) తమకున్న సొంత జ్ఞానంతో వినూత్న వ్యవసాయ యంత్రపరికరాలను ఆవిష్కరిస్తున్న గ్రామీణులు సైతం ఈ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు.
రైతులకు మరో 9 కోర్సులు..
18 ఏళ్లు నిండి కనీసం 8వ తరగతి చదివిన మహిళా లేదా పురుష రైతులు ఎవరైనా శిక్షణ పొందడానికి వీలున్న 9 కోర్సులు కూడా గార్లదిన్నెలోని ఎస్.ఆర్.ఎఫ్.ఎం.టి.టి.ఐ.లో ఉన్నాయి. అవి:
► వ్యవసాయంలో శక్తి వినియోగం – 4 వారాలు ∙వివిధ వ్యవసాయ యంత్రాల ఎంపిక, వినియోగించే విధానం, జాగ్రత్త చర్యలు, వాటి యాజమాన్యంపై శిక్షణ – 6 వారాలు ∙పవర్ టిల్లర్ను నడపటం, వాటి యాజమాన్యంపై శిక్షణ – 2 వారాలు ∙బిందు – తుంపర్ల సేద్య పరికరాల వినియోగం, యాజమాన్యంపై శిక్షణ – ఒక వారం ∙సస్య రక్షణా పరికరాల ఎంపిక, వాటి వినియోగ విధానంపై శిక్షణ – ఒక వారం
► చేతి పంపుల ఎంపిక, వాటి వినియోగం, యాజమాన్యంపై శిక్షణ– 2 వారాలు ∙మెట్ట సేద్య వ్యవసాయ యంత్రాల ఎంపిక, వాటి నిర్వహణ, యాజమాన్యంపై శిక్షణ – 2 వారాలు ∙పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల ఉత్పత్తిలో వినియోగించే యంత్రాలపై శిక్షణ – ఒక వారం
► వరి సాగులో ఉపయోగించే వివిధ రకాల యంత్రాలపై శిక్షణ – ఒక వారం
ఉపకార వేతనం, చార్జీలు..
హాస్టల్లో ఉండి శిక్షణ పొందే మహిళా/పురుష రైతులకు రోజుకు ప్రతి ఒక్కరికీ రూ.175 ఉపకార వేతనం, ప్రయాణ చార్జీలు చెల్లిస్తారు. సర్టిఫికెట్లు ఇస్తారు.
రైతులు దరఖాస్తు చేసే విధానం :
దరఖాస్తు ఫారాలను సంస్థ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని, పూర్తిచేసి ఈ కింద పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా పంపవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలకు తగిన ప్రమాణ పత్రాలను జత పరిచి సంస్థ చిరునామాకు పంపాలి. ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారు ఏయే తేదీల్లో శిక్షణకు రావాల్సిందీ సంస్థ తెలియపరుస్తుంది.
ఇతర వివరాలకు..
డైరెక్టర్, దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ – పరీక్షణ సంస్థ
టాక్టర్ నగర్, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఫోన్ : 08551–286441
E-mail: fmti-sr@nic.in ::: website: www.dacnet.nic.in/srfmtti
– జెన్నె ఆదినారాయణ, సాక్షి, గార్లదిన్నె, అనంతపురం జిల్లా
మహిళలకు అనుకూలమైన పరికరాలను రూపొందించాలి..!
వ్యవసాయంలో స్త్రీ, పురుషుల మధ్య స్పష్టమైన శ్రమ విభజన జరిగిందని ఇప్పటికే అందరూ గుర్తించారు. మహిళలు పంటల సాగు పనుల్లోనూ పంట కోసిన తర్వాతా అనేక అత్యంత శ్రమ భారం గల పనులు చేస్తున్నారు. మహిళలకు అనుకూలంగా వుండి, వారి శ్రమను తగ్గించి, సమయాన్ని ఆదా చేసి వ్యవసాయోత్పత్తిని పెంచే పరికరాలను రూపొందించి ప్రోత్సహించాలి. ఈ పరికరాలను ఉపయోగించటంలో మహిళా రైతులకు నైపుణ్యాన్ని పెంచే శిక్షణ ఇవ్వటంపై దృష్టిని కేంద్రీకరించాలి. మహిళలకు అనుకూలంగా ఉండే యంత్ర పరికరాలను సమకూర్చే కేంద్రాలను నడపడానికి మహిళా శ్రామికులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మహిళా రైతుల గుర్తింపు, సాధికారిత, మద్దతు వ్యవస్థలు కల్పించడం వంటి హక్కుల సాధన ప్రక్రియలో ఈ చర్యలు ఎంతో కీలకమైనవి.
– గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్, తార్నాక, సికింద్రాబాద్
www.makaam.in; mahilakisan.makaam@gmail.com
మహిళా రైతులంటే ఎవరు?
మన దేశంలో మహిళా శ్రామికులు అత్యధికంగా వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు. సాగులో ఉన్న ఏ ఎకరం పొలంలోనైనా పురుషుల కంటే మహిళలు పని చేసే రోజులే ఎక్కువ. వ్యవసాయం గిట్టుబాటు కాక పురుషులు వేరే పనులు వెదుక్కుంటూ వలస పోయినప్పుడు లేదా వ్యవసాయ కుటుంబాల్లో పురుషులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు / చనిపోయినప్పుడు వ్యవసాయ భారాన్ని రైతు కుటుంబాల్లోని మహిళలే పూర్తిగా భుజానికెత్టున్నారు. అందువల్ల మన దేశ వ్యవసాయానికి మహిళా రైతులే వెన్నెముక అంటే అతిశయోక్తి బొత్తిగా లేదు.
అయితే, వ్యవసాయ రంగంలో మహిళలు చేస్తున్న అపారమైన కృషికి అటు సమాజం నుంచి కానీ, ఇటు ప్రభుత్వం నుంచి కానీ గుర్తింపు లేకుండా పోతున్నది. వారిని కనీసం రైతులుగా గుర్తించడం లేదు. ఇంతకీ మహిళా రైతులంటే ఎవరు? తమ పేరున రిజిస్టరైన సొంత భూమిలో పంటలు సాగు చేస్తున్న మహిళలు, తమ కుటుంబ పొలాల్లో పనిచేస్తున్న మహిళలు, కౌలు భూమిని సాగు చేస్తున్న మహిళలు, అడవులపై ఆధారపడి జీవిస్తున్న మహిళలు, పశుపోషణతో జీవనం సాగిస్తున్న మహిళలు, వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్న మహిళా కూలీలు.. వీళ్లందరూ మహిళా రైతులేనని జాతీయ రైతుల విధానం (2007) నిర్వచించింది.