Department of Medical Education
-
నర్సులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం
సాక్షి, అమరావతి: నర్సులకు శిక్షణ ఇచ్చే స్టేట్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఎంఐటీ)లను రాష్ట్రంలోని 10 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో దశలవారీగా ప్రారంభించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే తిరుపతి, గుంటూరు నర్సింగ్ కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాతా, శిశు సంరక్షణ, ప్రసూతి సేవలను నర్సుల ద్వారా అందించే ఉద్దేశంతో.. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ‘పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ’ కోర్సును కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ(ఎన్‌పీఎం) కోర్సుకు సంబంధించి పలు మార్గదర్శకాలతో వైద్య శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. 18 నెలల పాటు నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ ఇస్తారు. ఇందులో ఏడాది పాటు శిక్షణ, 6 నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వీరికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి ఎస్‌ఎంఐటీలో ఆరుగురు మిడ్వైఫరీ ఎడ్యుకేటర్లు ఉంటారు. ఎన్‌పీఎం శిక్షణ పొందడానికి ఇన్‌సర్వీస్‌లో ఉన్న శాశ్వత, కాంట్రాక్ట్ నర్సులు అర్హులు. 45 ఏళ్లలోపు వయసు, జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత, ప్రసవాలు నిర్వహించడంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఈ కోర్సు వ్యవహారాలను డీఎంఈ పర్యవేక్షిస్తారు. శిక్షణ అనంతరం నర్సులకు సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. -
Andhra Pradesh: పీజీ వైద్య సీట్లు డబుల్!
సాక్షి, అమరావతి: స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో ప్రభుత్వ పరిధిలోని వైద్య కాలేజీల్లో భారీగా పీజీ వైద్య సీట్లు పెంచుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు దాదాపు రెట్టింపు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. దీనివల్ల భవిష్యత్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు విద్యార్థులకు సైతం పీజీ వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అన్ని స్పెషాలిటీలలో పీజీ సీట్లు 1,008 ఉండగా.. కొత్తగా 939 సీట్లను పెంచుకునే అవకాశం ఉన్నట్టు వైద్య విద్యా శాఖ తాజా అంచనాల్లో తేలింది. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కాలేజీల్లో భారీగా సీట్లు పెరగనున్నాయి. అదనపు పడకలు.. స్టాఫ్‌కు అనుమతి కావాలి ప్రస్తుత అంచనా ప్రకారం 939 పీజీ సీట్లు పెంచుకోవాలంటే ఆయా కళాశాలల్లో అదనపు పడకలు, అందుకు తగిన సిబ్బంది నియామకానికి అనుమతి కావాలి. బోధనాస్పత్రుల్లో వాస్తవ పడకల సంఖ్య 11,274 కాగా.. ఎప్పటికప్పుడు అవసరం మేరకు అనధికారికంగా పడకలు పెంచుకుంటూ వాటిని 13,376కు చేర్చారు. అంటే 2,102 పడకలు అనధికారికంగా ఉన్నాయి. తాజాగా అంచనా వేసిన లెక్క ప్రకారం 7,783 పడకలు కావాలి. ప్రస్తుతం అనధికారికంగా ఉన్న 2,102 పడకలతో పాటు 5,681 పడకలకు మంజూరు ఇవ్వాలి. భారీగా యూనిట్లు పెరుగుతాయి బోధనాస్పత్రుల్లో యూనిట్లే కీలకం. ప్రస్తుతం మన బోధనాస్పత్రుల్లో 377 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. పీజీ వైద్య సీట్లు పెరగాలంటే మరో 184 యూనిట్లు పెంచాలని అంచనా వేశారు. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన పడకలు, యూనిట్లు పెంచుకుంటూ వెళ్లాలి. కానీ గత ఏడేళ్లుగా ఈ పని జరగలేదు. దీంతో జనాభా పెరుగుతున్న కొద్దీ బోధనాస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. పీజీ సీట్లు, పడకలు, యూనిట్లు పెరిగితే ఈ ఒత్తిడి తగ్గుతుంది. సిబ్బందిని పెంచుకోవాల్సిందే పీజీ సీట్లు పెంచుకోవాలంటే వైద్య అధ్యాపకులను పెంచుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా 15 మంది ప్రొఫెసర్లు, 111 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం 57 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. సిబ్బందిని పెంచుకోవడం వల్ల 33 అదనపు సూపర్ స్పెషాలిటీ సీట్లనూ పెంచుకునే వీలుంటుంది. యూనిట్లు, పడకలు, వైద్యులు వంటివన్నీ పెరగడం వల్ల రోజువారీ ఔట్ పేషెంట్ సేవలు, ఇన్ పేషెంట్ సేవలు భారీగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి ప్రతిపాదన తాజాగా అంచనా వేసిన మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. పీజీ వైద్యసీట్లు పెరగడం వల్ల రానున్న రోజుల్లో రాష్ట్రంలో స్పెషలిస్టు వైద్యుల సంఖ్య బాగా పెరుగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల వారికీ స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం నాడు–నేడు పనులతో వైద్య కళాశాలల్లోనూ మౌలిక వసతులు పెరుగుతున్నాయి. పీజీ సీట్లు పెరిగితే బోధనాస్పత్రులు ప్రైవేటుకు దీటుగా ఎదిగే అవకాశం ఉంటుంది. – డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, డైరెక్టర్, వైద్య విద్య -
భారీగా పీజీ సీట్ల పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటరీ నియోజకవర్గానికొకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు పీజీ వైద్య సీట్లను పెంచేందుకు నడుం బిగించింది. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో 11 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో 980 వరకూ పీజీ వైద్య సీట్లున్నాయి. మరిన్ని సీట్లు పెరగాలంటూ యూనిట్లు పెంచడం, మౌలిక వసతులు కల్పించడం, పడకల స్థాయి పెంచడం వంటివి చేయాలి. ఇవన్నీ చేసేందుకు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నెల్లూరు, గుంటూరు, విజయవాడ వైద్య కళాశాలల్లో భారీగా సీట్లు పెంచేందుకు ఇప్పటికే వైద్య విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. పెంచనున్న సీట్లకు అఫిలియేషన్ కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి దరఖాస్తు చేసింది. యూనివర్శిటీ అనుమతించిన అనంతరం భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి దరఖాస్తు చేస్తారు. జూన్ 30లోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని వైద్యవిద్యా శాఖాధికారులు తెలిపారు. ఆ మూడు కాలేజీల్లో సీట్ల పెంపు ► నెల్లూరు, గుంటూరు, విజయవాడలోని మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు పెంచేందుకు ఏర్పాట్లుచేశారు. ► కొత్తగా నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 104 క్లినికల్ పీజీ వైద్య సీట్లు, మరో 16 నాన్ క్లినికల్ పీజీ వైద్య సీట్లు పెంచనున్నారు. ► గుంటూరు వైద్య కళాశాలలో రెండు ఎండీ రేడియో డయాగ్నసిస్ సీట్లు ఉండగా మరో 4 అదనంగా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ► విజయవాడలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతుండటంతో 19 గైనకాలజీ సీట్లు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ► ఈ మూడు వైద్య కళాశాలల్లో 158 పీజీ వైద్య సీట్లు కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ► ఈ ఏడాది గుంటూరులో కొత్త విభాగాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ► అదనంగా సీట్లు పెరగడంవల్ల యూనిట్లు పెరగడంతోపాటు స్పెషాలిటీ సేవలు పేద రోగులకు అందుబాటులోకి వస్తాయి. మిగతా కాలేజీల్లోనూ ఏర్పాటుకు సన్నాహాలు ప్రస్తుతం ఈ మూడు కాలేజీల్లో సీట్లకు దరఖాస్తు చేస్తున్నాం. ఈ సీట్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది నుంచి ఇవి అందు బాటులోకి వస్తాయి. ఇవికాకుండా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు మిగతా కాలేజీల్లోనూ ఎక్కడ అవకాశముంటే అక్కడ పీజీ వైద్య సీట్ల పెంపునకు కృషిచేస్తున్నాం. – డా. కె.వెంకటేష్, వైద్యవిద్యా సంచాలకులు ‘పీజీ’ చేసిన వారే బోధనకు అర్హులు రాష్ట్రంలో పలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో నాన్ మెడికల్ పీజీ వారితో బోధన చేయిస్తున్నారని, ఇది భారతీయ వైద్య మండలి నిబంధనలకు విరుద్ధమని ఎంబీబీఎస్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీ క్లినికల్, పారా క్లినికల్ సబ్జెక్టుల్లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ చేసిన వారితోనే బోధన చేయించాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా వీళ్లు మాత్రమే అర్హులని ఎంసీఐ స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని తోసిరాజని ప్రయివేటు వైద్య కళాశాలలు ఎంఎస్సీ బయో కెమిస్ట్రీ, ఎంఎస్సీ అనాటమీ, ఎంఎస్సీ ఫిజియాలజీ, ఎంఎస్సీ ఫార్మకాలజీ చదివిన వారితో పాఠాలు చెప్పేందుకు అనుమతిస్తున్నారు. ► ఎంఎస్సీ చదివిన వారైతే తక్కువ వేతనానికి వస్తారని, మెడికల్ పీజీ చదివిన వారికి ఎక్కువ వేతనం ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేస్తున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. ► ఒకవేళ ఎండీ, ఎంఎస్, డీఎన్బీ అభ్యర్థులు లేకుంటే ఎంఎస్సీ చదివిన వారిని కేవలం ట్యూటర్లుగా మాత్రమే నియమించుకోవాలని ఎంసీఐ స్పష్టం చేసింది. ► నాన్ మెడికల్ పీజీ చేసిన వారు పాఠాలు సరిగా చెప్పలేకపోతున్నారని ప్రైవేటు వైద్యకళాశాలల్లో చదువుతున్న ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు వాపోతున్నారు. ► త్వరలోనే దీనిపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు కొంతమంది వైద్యవిద్యార్థులు పేర్కొన్నారు. ► 2018లో అప్పటి ప్రభుత్వం సైతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వారూ అర్హులని నోటిఫికేషన్ ఇవ్వడం ఎంసీఐ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. ముగిసిన తొలి విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జీవో 57తో 187 మంది ఎంఆర్సీలకు మేలు 2020–21 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్, ఎండీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రెండు రోజులుగా నిర్వహించిన తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆదివారంతో ముగిసింది. పీజీ మెడికల్‌లో 1,134 సీట్లకు 1,091, ఎండీఎస్‌లో 235 సీట్లకు 219 సీట్లు భర్తీ అయ్యాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. 2013లో ఇచ్చిన జీవో 43 ప్రకారం మెరిటోరియస్ రిజర్వుడు క్యాండిడేట్స్ (ఎంఆర్సీ) విద్యార్థులకు అన్యాయం జరుగుతోందనే విషయమై పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసి కొన్ని సవరణలు చేస్తూ పీజీ మెడికల్‌కు జీవో నం.57, పీజీ డెంటల్ (ఎండీఎస్)కు జీవో నెం.58 జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఈ జీవోలతో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే పీజీ మెడికల్‌లో 187 మంది, ఎండీఎస్‌లో 30 మంది ఎంఆర్సీ అభ్యర్థులకు మేలు జరిగినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. అయితే 57, 58 జీవోలపై కొంత మంది ఆదివారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసినట్లు యూనివర్సిటీ వర్గాల సమాచారం. -
ఏపీలో 9,700 ‘వైద్య’ పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా 9,700 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వైద్య విద్యా శాఖలో.. బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్‌లో.. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్ల నుంచి స్టాఫ్ నర్సుల వరకు మొత్తం 9,700 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నియామకాల నోటిఫికేషన్‌ను నేడో, రేపో జారీ చేయనున్నారు. 2010 నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వాస్పత్రుల్లో నియామకాలకు ఎప్పుడూ మొగ్గుచూపలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ప్రభుత్వాస్పత్రుల బలోపేతం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య విద్యాశాఖ పరిధిలో 15 కొత్త వైద్య కళాశాలలు, నాడు–నేడులో భాగంగా ఆస్పత్రి భవనాల పునర్నిర్మాణం, కొత్త భవనాల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. మూడేళ్ల ప్రొబేషనరీ.. ► ఎంపికైన వైద్యులు మూడేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉంటారు. ఆ తర్వాత వారి సర్వీస్ రెగ్యులర్ అవుతుంది. ►కొత్తగా ఎంపికయ్యే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతి లేదు. బేసిక్ శాలరీలో 15 శాతం ఎన్పీఏ (నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్) ఇస్తారు. ►ఎంపికైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఒక ఏడాది విధిగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ►వైద్యులు, కొన్ని విభాగాల్లో స్టాఫ్ నర్సులు, పరిపాలనా సిబ్బందిని మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తారు. ►ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డెంటల్ అసిస్టెంట్ వంటి మిగతా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. -
9 వైద్య కళాశాలల్లో కొత్త విభాగాలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న వైద్య అవసరాలు, కొత్తరకం జబ్బులను ఎదుర్కోవడానికి బోధనాస్పత్రులను మరింత బలోపేతం చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లేని కొత్త విభాగాలను వాటిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ నిర్ణయించింది. 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా ఇందులో 9 బోధనాస్పత్రుల్లో అవసరాన్ని బట్టి కొత్త విభాగాలు, కొన్ని చోట్ల ఉన్న విభాగాల్లోనే అదనపు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. బోధనాస్పత్రికి వెళ్తే ఎక్కడా ‘ఈ జబ్బుకు వైద్యం లేదు’ అనే మాట రాకుండా చేయాలన్నదే సర్కార్ ఉద్దేశం. దీనికి తగ్గట్టు పడకలు, డాక్టర్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కొత్త విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్‌లో పీజీ వైద్య సీట్లు కూడా పెరగనున్నాయి. వైద్య కళాశాలలు – విభాగాలు.. ► గుంటూరు మెడికల్ కాలేజ్: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్) ► కర్నూలు మెడికల్ కాలేజ్: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్) ► ఎస్వీఎంసీ, తిరుపతి: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ ► ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్), కార్డియాలజీ (అదనపు యూనిట్) ► ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అనంతపురం: పీడియాట్రిక్ సర్జరీ ► రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్) ► ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కడప: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, నియోనెటాలజీ ► ప్రభుత్వ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ► ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఒంగోలు: ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ. -
ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి ‘మెడికల్ బిల్లులు’
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల పరిశీలన బాధ్యతల్ని ఇకపై ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబాల వారు ఎవరైనా ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చేయించుకుంటే దానికైన ఖర్చును ప్రభుత్వం నుంచి పొందేందుకు వైద్య విద్యా సంచాలకులకు బిల్లులు ఇచ్చేవారు. అక్కడ పరిశీలించిన బిల్లులను తిరిగి సొంత శాఖకు పంపిస్తే, అక్కడ చెల్లించేవారు. ఇప్పుడు పరిశీలన ప్రక్రియను వైద్య విద్యాశాఖ నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌కు ఇచ్చారు. ప్రస్తుతం మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు ఆన్లైన్ ప్రక్రియ లేదని, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. -
గ్రామీణ సేవలపై పీటముడి
పట్టు వీడని ప్రభుత్వం.. మెట్టు దిగని జూడాలు ఠ 28 రోజులుగా కొనసాగుతున్న సమ్మె హైదరాబాద్: ప్రభుత్వం, జూడాలు ఎవరికి వారే పట్టువీడకపోవడంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. 28 రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెకు విపక్షాల నుంచి మద్దతు పెరుగుతోంది. రెండ్రోజులుగా రిలే నిరాహార దీక్షలు కూడా మొదలు పెట్టిన జూడాలు ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,700 మంది దాకా ఈ సమ్మెలో పాల్గొంటుండడంతో బోధనాసుపత్రుల్లో రోగులకు తిప్పలు తప్పడం లేదు. గతనెల 29న మొదలైన సమ్మెను విరమింప జేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అయిదు పర్యాయాలు చర్చలు జరిపిందని వైద్య విద్య విభాగం అధికారులు చెబుతున్నారు. వారు పెట్టిన అయిదు డిమాండ్లలో నాలుగింటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. కానీ ఏడాది పాటు గ్రామీణప్రాంతాల్లో సేవలు అందించడమే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఈ విషయంలో జూడాల డి మాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించలేమని, ఇది కోరు ్టలో పెండింగ్‌లో ఉన్నందున ఇప్పటికిప్పుడు స్పందించలేమన్నది ప్రభుత్వ వాదన. ‘తాత్కాలికంగా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు వినియోగించుకుని వదిలించుకోవడం ఏమిటి? పర్మనెంటుగా ఉద్యోగాల్లోకి తీసుకోండి. సర్వీసు పూర్తయ్యే వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తాం’ అన్నది జూనియర్ డాక్టర్ల ప్రతివాదన. మొత్తానికి ఈ ఒక్క అంశమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకంగా మారింది. ప్రభుత్వం ఏమంటోందంటే.. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్న బలమైన అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. వాస్తవానికి గతంలో మూడేళ్లపాటు విధిగా చేయాల్సిన ‘రూరల్ సర్వీసు’ నిబంధన వృత్తిపరంగా అడ్డంకిగా ఉందంటూ 2012లో 55 రోజులపాటు జూడాలు సమ్మెకు దిగారు. దీంతో ఆ సమయంలోనే అప్పటి ప్రభుత్వం 107 జీవో ద్వారా మూడేళ్ల సర్వీసు నిబంధనను ఏడాదికి కుదించింది. ఇప్పుడు జూడాలు వారి డిమాండ్ నుంచి వారే వెనక్కి తగ్గితే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ఏడాది నిబంధనను కూడా పూర్తిగా ఎత్తివేయాలని, 107 జీవోను రద్దు చేయాలని కోరుతూ 2012లోనే అప్పటి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఇంకా ఎటూ తేలలేదు. కోర్టులో పెండింగులో ఉన్న అంశంలో ఎలా జోక్యం చేసుకుంటామని ప్రభుత్వం అంటోంది. అదీ కాకుండా గతేడాది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ 10/2013 (ఏపీ మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్) అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్, పీజీ(స్పెషలిస్టు), సూపర్ స్పెషలిస్టు డిగ్రీలు పూర్తయ్యాక, ఏదో ఒక కోర్సు తర్వాత ఏడాది పాటు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తామని వైద్య విద్య అధికారులు చెబుతున్నారు. ఫలితంగానే ఈ ఏడాది ‘రూరల్ సర్వీసు’ అంశం పీటముడిగా మారింది. జూనియర్ డాక్టర్ల వాదన ఇదీ.. జూనియర్ డాక్టర్ల వాదన దీనికి భిన్నంగా ఉంది. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. అయితే శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోవాలని వాదిస్తున్నారు. తాత్కాలికంగా పనిచేయించుకుని ఎలా వదిలించుకుంటారన్నది వీరి ప్రశ్న. ప్రతీ ఏటా కనీసం 600 మంది వైద్యులు సర్వీసులో చేరుతున్నారని, ముందు ఖాళీలను భర్తీ చేయడానికి పూనుకుంటే సమస్య పరిష్కారమవుతుందని జూనియర్ డాక్టర్లు పేర్కొంటున్నారు. ఏడాది గ్రామీణ సర్వీసును పూర్తి చేశాకే ఎంసీఏ రిజిస్ట్రేషన్లు చేస్తామనడం సరికాదని విమర్శిస్తున్నారు. ఏడాది సర్వీసును తప్పనిసరి అని కాకుండా, స్వచ్ఛందం అనాలని, ఇలా సర్వీసులో చేరిన వారికి ఆ తర్వాత జరిగే రిక్రూట్మెంటులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ముందుగా ఏపీ ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టాలన్నది జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులుగా ఆరునెలల పాటు కాంట్రాక్టు పద్ధతిన తీసుకుని, ఆ తర్వాత వదిలించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఆదివారం తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కూడా ఇవే డిమాండ్లను పునరుద్ఘాటించారు. మొత్తానికి ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విశ్వరూపం దాలుస్తోంది. బోధనాసుపత్రుల్లో సరైన వైద్య సేవలందక ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో పేదలు నానా యాతన పడుతున్నారు.