ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టెన్షన్
ఈ నెలాఖరుతో ముగియనున్న కాలపరిమితి
కొత్తగా టెండర్లు పిలుస్తారో.. పాత వారినే తీసుకుంటారో?
చిత్తూరు (టౌన్): జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి ఈనెలాఖరుతో ముగియనుంది. దీంతో ఇటు అధికారులకు అటు ఉద్యోగులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రతి శాఖలోనూ పదుల సంఖ్యలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కొన్ని శాఖల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పట్లో తేల్చే పరి స్థితి కనిపించక పోవడంతో కొన్ని శాఖల అధికారులు డీలాపడిపోతున్నారు.
2013-14కు గాను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న సిబ్బంది కాలపరిమితి గత మార్చి 31వ తేదీతో పూర్తయింది. అయితే రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున గవర్నర్ అనుమతితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వారి కాలపరిమితిని మూడు నెలలు పొడిగించారు. ఆ పొడిగింపు ఈ నెలాఖరుతో పూర్తి కానుంది.
అయితే పొడిగింపు ఆదేశాలిచ్చిన అధికారులు వారి జీతాల బడ్జెట్ సంగతిని ఇప్పటికీ తేల్చలేదు. కాలపరిమితి పూర్తయ్యే లోగా ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలను క్లియర్ చేయాల్సి ఉంది. పాతవారినే కొనసాగిస్తే ఫర్వాలేదు కానీ టెండర్ల ప్రక్రియ ద్వారా కొత్తవారిని తీసుకుంటే ఇప్పుడున్న వారి జీతాలను ఎలా క్లియర్ చేయాలనేడైలమాలో అధికారులు ఉన్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లే కీలకం
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమశాఖ, డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ తదితర శాఖల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ శాఖల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా, డేటాఎంట్రీ ఆపరేటర్లుగా చాలామంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులే పనిచేస్తున్నారు.
ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని జూలై నుంచి టెండర్ల ద్వారా కొత్తవారిని తీసుకుంటే అప్పుడేం చేయాలనేది ఈ శాఖల అధికారులకు పాలుపోవడం లేదు. కొత్తగా వచ్చేవారు పని నేర్చుకునే వరకు జరగాల్సిన రోజువారి విధులను ఎలా నిర్వర్తించాలనే ప్రశ్న వారిని వేధిస్తోంది. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల్లాంటి కీలక శాఖల్లో విద్యార్థులు, వారికి వర్తించే పథకాలు, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బడ్జెట్ తదితరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టడం, డౌన్లోడ్ చేసుకోవడం తదితరాలను నిత్యం చేపడుతూ రావాలి.
ఈ విషయాల్లో నిత్యం జిల్లా ప్రగతిని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలి. అయితే ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తుండడంతో వారు లేకుం టే ఏం చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. జిల్లాలోని పలుశాఖల్లో నాలుగు వేలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా వీరందరి కాలపరిమితి పూర్తికానుంది. దాంతో ఆయా శాఖల అధికారులతోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.