Departmental inquiry
-
వాంఖెడే X నవాబ్ మాలిక్
ముంబై: ముంబై తీరంలోని నౌకలో మాదకద్రవ్యాలు లభించిన కేసులో ఇప్పుడు అందరి దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపైనే ఉంది. వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణలకు సంబంధించి బుధవారం ఆయనపై శాఖాపరమైన దర్యాప్తు మొదలైంది. ఈ కేసులో వాంఖెడేపై రోజుకొక కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి దందా, ఫోన్ ట్యాపింగ్, సాక్షుల్ని ముందే కూడగట్టారు, జన్మతః ముస్లిం వంటి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ వాంఖెడేపై మధ్య పోరాటంగా ఈ కేసు మలుపులు తిరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న విజిలెన్స్ దర్యాప్తు బృందం బుధవారం ఉదయం ముంబైకి చేరుకొని వాంఖెడేపై విచారణ మొదలు పెట్టింది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) జ్ఞానేశ్వర్ సింగ్ అవినీతి అరోపణలపై సమీర్ వాంఖెడే స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టుగా మీడియాకి వెల్లడించారు. వాంఖెడే స్టేట్మెంట్ రికార్డు చేయడానికి నాలుగున్నర గంటలకు పైగా పట్టింది. ఎన్సీబీ కార్యాలయం నుంచి ఈ కేసుకి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. అయితే వాంఖెడే తనపై వచ్చిన ఆరోపణలపై ఏమంటున్నారో ఆయన వెల్లడించలేదు. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఇప్పుడే వివరాలను బయటపెట్టలేమన్నారు. అవసరమైతే వాంఖెడే నుంచి మళ్లీ సమాచారం సేకరిస్తామని జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. మరోవైపు ఇదే కేసులో ఆర్యన్‌ఖాన్‌ని విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించిన సాక్షి ప్రభాకర్ సాయిల్ స్టేట్మెంట్ను ముంబై పోలీసులు రికార్డు చేశారు. సాయిల్ రికార్డు పూర్తి చేయడానికి వారికి ఎనిమిది గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం మొదలైన ప్రక్రియ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి ముగిసింది. మరోవైపు సాయిల్కి ఎవరూ హాని తలపెట్టకుండా మహారాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. ఆర్యన్ బెయిల్‌పై కొనసాగుతున్న వాదనలు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై వరసగా రెండోరోజు బుధవారం బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు కుట్ర చేశారని ఆరోపిస్తున్న ఎన్సీబీ ఈ అంశంలో అధికారికంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌డబ్ల్యూ సాంబ్రే దృష్టికి లాయర్లు తీసుకువచ్చారు. అరెస్ట్ మెమోలో సరైన సాక్ష్యాధారాలేవీ లేవని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ చెప్పారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు తమ క్లయింట్లకు ఎందుకు ఇవ్వడం లేదని మరో న్యాయవాది అమిత్ దేశాయ్ ప్రశ్నించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. షారుఖ్‌కు గతంలో జరిమానా! బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు సమీర్ వాంఖెడేతో పరిచయం కొత్తదేమీ కాదు. 2011లో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలోనే సమీర్... షారుఖ్‌కు చుక్కలు చూపించారు. అప్పట్లో హాలెండ్, లండన్లలో సెలవులు గడిపి ముంబైకి తిరిగివచ్చిన షారుఖ్ దగ్గర పరిమితికి మించిన అధిక బ్యాగేజీ ఉందని సమీర్ వాంఖెడే ఆయన్ను విచారించారు. రూ.1.5 లక్షల జరిమానా విధించి వదిలిపెట్టారు. -
పేకాట సామ్రాజ్యం కూల్చేస్తాం!
మహబూబ్‌నగర్ క్రైం : పేకాట రాయుళ్లు తీరు మార్చుకోవాలని.. లేకపోతే ఎంతటి వారైనా దాడులు చేసి చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ డీఎస్పీ సాయి మనోహర్ హెచ్చరించారు. ఆదివారం హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తచెరువుతండా అడవిలో పేకాట అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ విలేకరులకు వివరించారు. పేకాట రాయుళ్లది పెద్ద సామ్రాజ్యమే ఉందని, ప్రతి ఆదివారం పక్కా ప్లాన్‌తో పేకాట ఆడటానికి ప్రణాళిక రచిస్తారని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 1న హన్వాడ పరిధిలోని కొత్త చెరువు తాండ సమీపంలో ఉన్న అటవి ప్రాంతంలో అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో దాడులు జరిగాయని చెప్పారు. ఈ దాడులలో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా బాలరాజు అలియాస్ బాలు అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇతడు శివ అనే వ్యక్తితో పేకాట రాయుళ్లకు సమాచారం అందిస్తూ కావాల్సిన ఏర్పాటు చేస్తాడని, పద్ధతి మార్చుకోవాలని గతంలో నోటీసులు ఇచ్చినా మారకపోవడంతో దాడులు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం 16మంది ఉన్నారని, వారిలో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ జావేద్ కూడా ఉన్నట్లు నిర్దారణ కావడంతో అతనిపై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వారిని రిమాండ్ చేయడంతో పాటు రూ.లక్షా 21 నగదు, 10ద్విచక్ర వాహనాలు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదైన వారిలో పల్లె వంశీ, పాష, సయ్యద్ మెహిజ్, సతీష్, సలాన్, రాజు, తిరుపతయ్య, నర్సింహులు, చంద్రనారాయణ్, వెంకటస్వామి, రాఘవేందర్, నాగరాజు, వెంకటేష్, శంకర్‌నాయక్, శివ, బాలరాజు ఉన్నారు. కానిస్టేబుల్ జావేద్ పరారీలో ఉన్నాడు. సమావేశంలో రూరల్ సీఐ కిషన్, హన్వాడ ఎస్ఐ రాంబాబు ఉన్నారు. -
శాఖాపరమైన విచారణకు మాజీ ఉద్యోగులు
న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ విభాగాల్లో శాఖాపరమైన విచారణలు నిర్వహించేందుకు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాజీ ఉద్యోగులను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై నిర్వహించే శాఖాపరమైన విచారణలో జాప్యం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు అధికారులుగా నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులకు రూ.20 వేల నుంచి, రూ.75వేల వరకు ఆయా కేసుల స్థాయిని బట్టి కేసుల వారీగా చెల్లిస్తారు. రవాణా అలవెన్స్ కింద రూ. 40వేలు, సదరు మంత్రిత్వ శాఖ నుంచి సహాయకుల సహాయం అందని సందర్భంలో మరో రూ.30 వేలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీ స్థాయి ర్యాంకు.. రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతకు సమాన స్థాయి హోదాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను మాత్రమే నియమిస్తారు.