సింగరేణిలో 15 నుంచి సమ్మె సైరన్!
డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు విఫలం
సాక్షి, మంచిర్యాల: సింగరేణి సంస్థలో చాలాకాలం తరువాత మళ్లీ సమ్మె సైరన్ మోగింది. వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని ఈనెల 15 నుంచి నిర్వహించ తలబెట్టిన సమ్మెపై మంగళవారం హైదరాబాద్లో కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యాంసుందర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వారసత్వ ఉద్యోగాల అమలు విషయంలో యాజమాన్యం స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని ఐదు జాతీయ సంఘాలు నిర్ణయించాయి. సమ్మెకు ఐదు జాతీయ సంఘాలు పిలుపునివ్వగా, అధికార గుర్తింపు యూనియన్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) మాత్రం దూరంగా ఉంది.
మరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే సింగరేణి సంస్థ, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కార్మికులెవరూ సమ్మెలోకి వెళ్లకూడదని కోరుతూ సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ నాలుగు పేజీల లేఖను పత్రికా ప్రకటనగా విడుదల చేశారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ విషయంలో యాజమాన్యం స్పందన సరిగా లేదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య చెప్పారు. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయన్నారు. కార్మికుల ఆకాంక్షను నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తోందని, తమ సత్తా ఏంటో సమ్మె ద్వారా తెలియజేస్తామని చెప్పారు.