భూకబ్జాల నిరోధానికి పటిష్ట చర్యలు
హోం మంత్రి చినరాజప్ప
టనకరికల్లు : ఎర్రచందనం, ఇసుక మాఫియా, భూకబ్జాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రూ.ఎనిమిది లక్షలో ఆధునికీకరించిన స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సోమవారం పునఃప్రారంభించారు. ముందుగా మొక్కలు నాటారు. శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. చినరాజప్ప మాట్లాడుతూ 27 నుంచి అన్ని శాఖలను నవ్యాంధ్ర రాజధానికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌శాఖను బలోపేతం చేసేందుకు నూతనంగా ఆరు వేల పోస్టుల మంజూరుకు కేబినేట్ ఆమోదం లభించిందని తెలిపారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తుని ఘటనను సీఐడీకి అప్పగించామన్నారు.
అదనపు పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై దృష్టి
ప్రత్యేక అవసరాల దృష్ట్యా అదనపు పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. ప్రజాసేవలో భాగంగా ప్రజల వద్దకు పోలీసింగ్‌ను అమలు చేస్తామన్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ఆర్డీవో జి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.