భూసేకరణతో భయపెడితే సహించం
బోరుపాలెం సీఆర్డీఏ కార్యాలయూనికి తాళం వేసిన రైతులు
తుళ్లూరు: నిత్యం పండే భూములను మెట్టగా నమోదు చేశారని, దీనిపై అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోలేదని బోరుపాలెం, అబ్బరాజుపాలెం రైతులు బోరుపాలెం సీఆర్డీఏ కార్యాలయానికి శనివారం తాళాలు వేశారు. తమ భూములను జరీబుగా గుర్తించాలని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జేసీ చెరుకూరి శ్రీధర్‌కు విన్నవించినా స్పందించకపోవడంతో కౌలు చెక్కులు తిరస్కరించామన్నారు. ఇప్పుడు తమ భూములకు కరెంటు నిలిపేస్తున్నారని, ఇలా చేస్తే వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. మా పక్క భూములు జరీబైనప్పుడు మావెందుకు కావని ప్రశ్నించారు. భూసేకరణ పేరుతో బెదిరించాలనుకుంటే ఆత్మహత్యలకూ వెనకాడబోమని హెచ్చరించారు.
జరీబు ప్రకటన మా పరిధిలో లేదు: డిప్యూటీ కలెక్టర్ శేషారెడ్డి
జరీబు భూములు గుర్తించే విషయంపై అధికారులకు నివేదిక పంపామని, ఇది తమ పరిధిలో లేదని బోరుపాలెం సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ శేషారెడ్డి తెలిపారు. జరీబు భూములుగా గుర్తించేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించిందని చెప్పారు. ఏడాదిగా సమస్యలు పరిష్కారం కానప్పుడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమన్నారు.
ఈ విషయంపై సీఆర్డీఏ ల్యాండ్ డెరైక్టర్ బీఎల్ చెన్నకేశవులును వివరణ కోరగా నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత కొంత సమయం పడుతుందని రైతులు కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు. సీఆర్డీఏ కార్యాలయూనికి తాళాలు వేశారని తెలిసిన ఎస్ఐ రవిబాబు సంఘటన స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ రెండు గ్రామాల్లో 42 ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఆయా గ్రామాల రైతులు చనుమోలు చంద్రశేఖరరావు, గూడూరు బుల్లెబ్బాయి, కంచర్ల శరత్, వెంకటేశ్వరరావు, తదితరులు చెప్పారు.