జనసంద్రంగా మారిన మంజీరా తీరం
వెల్లువలా తరలి వచ్చిన జనాలతో మంజీరా తీరం జనసంద్రంగా మారింది. జనమే జయుని సర్పయాగ స్ధలిలో..పవిత్ర స్నానం చేసిన జనం పులకించి పోయారు. వనదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్రెడ్డి ఉత్సవాలను మంగళవారం ప్రారంభించారు.
మాఘస్నానాల కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 70 వేల మంది భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాముకు ముందే ఏడుపాయల చేరుకున్న భక్తులు..ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా మంజీర నదిలో పుణ్య స్నానాలు చేసి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్రెడ్డి ఉదయం 11 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ విప్ జగ్గారెడ్డి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.