నేటి రాజకీయాల్లో విలువలు పతనం
భీమవరం : నేటి రాజకీయాల్లో విలువలు పతనమయ్యాయని ఆనాడు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం త్యాగాలు చేస్తే నేడు కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం దేశాన్నే తాకట్టుపెట్టే పరిస్థితి చోటు చేసుకుందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత నాచు వెంకట్రామయ్య శతజయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరం నాచువారి సెంటర్లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ నాటితరం ప్రజాప్రతినిధులు సమాజాన్ని సంపూర్ణంగా పరిశీలించడం వల్లే ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని, తమకు తెలియని ఎన్నో విషయాలను పుస్తక పఠనం ద్వారా పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని దేశాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. అటువంటి వ్యక్తుల్లో నాచు వెంకట్రామయ్య ఒకరని అటువంటి మంచి వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేయడం నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. నేటి తరం ప్రజా ప్రతినిధులు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం లేదని అసెంబ్లీలో ఉన్న గ్రంథాలయాన్ని ఒక్క శాసనసభ్యుడు కూడా సందర్శించకపోవడం దీనికి నిదర్శనమన్నారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎంపీ యర్రా నారాయణస్వామి మాట్లాడుతూ ఆనాడు వెంకట్రామయ్య ఎమ్మెల్యేగా మునిసిపల్ చైర్మన్‌గా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని ప్రధానంగా రైతుల సమస్యలు పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేసిన మహాయోధుడని కీర్తించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ వెంకట్రామయ్య భీమవరం పట్టణాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా భీమవరం–నరసాపురం రోడ్డును నాచు వెంకట్రామయ్య మార్గ్‌గా నామకరణం చేయడానికి మునిసిపాలిటీలో తీర్మానించనున్నట్టు చెప్పారు. సమావేశంలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు వంక సత్యనారాయణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి), మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, పొట్టి వెంకట రంగపార్థసారధి, చేగొండి సూర్యప్రకాష్, వంక నాగమణి, మెరగాని నారాయణమ్మ, పాకా సత్యనారాయణ, గోకరాజు రామం, గోకరాజు మురళీరంగరాజు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, చినమిల్లి వెంకటరాయుడు, కొటికలపూడి ఫణికుమార్, వబిలిశెట్టి కనకరాజు, గన్నాబత్తుల శ్రీనివాస్, డాక్టర్ ఎం.గోవిందబాబు, నాచు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖులకు సత్కారం
నాచు వెంకట్రామయ్య శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ సుంకరవెంకట ఆదినారాయణరావు, ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు, విగ్రహ శిల్పి డి.రాజ్‌కుమార్ వడయార్లను ఘనంగా సత్కరించారు.