యూపీ స్కూళ్లకు మంగళం?
6, 7 తరగతుల్లో 20 మంది కంటే తక్కువ ఉంటే ప్రాథమిక పాఠశాలలుగా మార్పు
విద్యాశాఖను ప్రతిపాదనలు కోరిన డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
డీఎస్సీలో పోస్టులు కోత పెట్టేందుకే అంటున్న ఉపాధ్యాయ సంఘాలు
చిత్తూరు(ఎడ్యుకేషన్) : పాఠశాల విద్యలో మార్పుల పేరుతో ప్రభుత్వం రోజుకో ఉత్తర్వు తెస్తూ అటు ఉపాధ్యాయుల్లోనూ, విద్యాశాఖ వర్గాల్లోనూ ఆందోళన రేపుతోంది. ఇప్పటికే రేషనలైజేషన్ అంటూ ఉపాధ్యాయుల్లో కలకలం రేపిన ప్రభుత్వం తాజాగా ప్రాథమికోన్నత పాఠశాలలను మూసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో 242 పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం తాజాగా యూపీ స్కూళ్లనే మూసివేసేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. డీఎస్సీలో పోస్టులు తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఒక్కో ఏర్పాటు చేసుకుంటూ వస్తోంది. బడి ఈడు పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించేందుకు ఒకపక్క ఆర్భాటంగా బడి పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభించి మరోవైపు పాఠశాల విద్యను నిర్వీర్యం చేసే పనులకు పూనుకుంటోంది.
ప్రతిపాదనలు ఇవ్వండి
జిల్లాలో 450 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 6, 7 తరగతుల్లో 20 మంది విద్యార్థుల కంటే సంఖ్య తక్కువగా ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్సీ) ఆదేశించింది. దీనికోసం ఆర్సీ నెంబర్ 36ను విడుదల చేసినట్లుగా ఉపాధ్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఏడాది నిర్వహించిన యూ-డైస్ సర్వే ప్రకారం జిల్లాలో తక్కువగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు 186 ఉన్నాయని, వాటికి ప్రతిపాదనలు పంపాలని డీఎస్సీ విద్యాశాఖకు సూచించింది. ఉన్నతాధికారులు 186 పాఠశాలలని చెప్పగా, విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం 205 పాఠశాలలున్నాయి. వీటిలో దేనికి ప్రతిపాదనలు పంపాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు.
డీఎస్సీలో కోత కోసమేనా
2012లో ఇచ్చిన జీఓ నెం 55 ప్రకారం మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైస్కూళ్లకు 6, 7 తరగతుల్లో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ సంఖ్య ఉన్న యూపీ స్కూళ్లను విలీనం చేయాలి. రెండేళ్లుగా అమలుకు నోచుకోని ఈ ఉత్తర్వులు తాజాగా తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. డీఎస్సీలో పోస్టుల సంఖ్య తక్కువగా ఇచ్చేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
ప్రాథమిక పాఠశాలలుగా చేయడం ద్వారా అక్కడ కొంతమంది ఉపాధ్యాయులు మిగిలిపోతారు. వీరిని రేషనలైజేషన్లో సర్దుబాటు చేస్తే చాలా వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుంది. మొదట తాత్కాలిక రేషనలైజేషన్ చేస్తామని చెప్పిన ఉన్నతాధికారులు డీఎస్సీ కంటే ముందు పూర్తి స్థాయిలో రేషనలైజేషన్ చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా డీఎస్సీకి పెద్దగా పోస్టులు ఇవ్వాల్సి అవసరం ఉండదనే ఇదంతా చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.