ఇక ఆన్లైన్లో బస్సు ప్రయాణికుల వివరాలు
చెక్‌పోస్టుల వద్ద క్రాస్‌చెకింగ్
మార్పులపై రవాణా శాఖ కసరత్తు
హైదరాబాద్: రవాణా శాఖ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణికుల వివరాల సేకరణను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. రైల్వేల్లో మాదిరిగా బస్సు ప్రయాణికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలనే నిబంధనను రవాణాశాఖ విధించబోతోంది. బస్సుల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారో, వారు ఎక్కడివారో కూడా ప్రస్తుతం అందుబాటులో ఉండటం లేదు. టికెట్ పొందిన ప్రతి ప్రయాణికుడి వివరాలను బస్సు బయలుదేరే ముందు సంబంధిత ట్రావెల్ ఏజెంట్ ఆన్లైన్లో పొందుపరచాలి. ఒకవేళ ప్రయాణికులను వేరే బస్సులోకి మార్చినా ఆ వివరాలను కూడా ఆన్లైన్లో చూపించాల్సిందే.
దీనికి సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. కేంద్రప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో దీన్ని తప్పనిసరి చేయబోతున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు బస్సు బయలుదేరేవేళ తప్పుడు పేర్లతో రెడీమేడ్ జాబితాను ఆన్లైన్లో ఉంచే అవకాశమున్నందున, దీన్ని నివారించేందుకు చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేయాలని రవాణా శాఖ యోచిస్తోంది. తప్పుడు వివరాలతో పట్టుబడితే సంబంధిత ట్రావెల్స్‌పై భారీ జరిమానా విధించనుంది.
స్కూల్ బస్సు డ్రైవర్ల వివరాలు ఇవ్వాల్సిందే...
గత సంవత్సరం మెదక్ జిల్లా మాసాయిపేటలో ప్రైవేటు స్కూల్ బస్సును రైలు ఢీకొనటంతో 18 మంది చనిపోయిన ఘటన పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. స్కూల్ బస్సుల తాత్కాలిక డ్రైవర్లపై దృష్టి సారించారు. రెగ్యులర్ డ్రైవర్ అందుబాటులో లేని సమయంలో తాత్కాలిక డ్రైవర్లు ఎవరో కూడా ఆన్లైన్లో వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. బస్సు ప్రమాదానికి గురైతే రూ.2 లక్షలకుపైగా పెనాల్టీతోపాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
4 నెలల ముందే రిజర్వేషన్
ఇప్పటి వరకు ఆర్టీసీ టికెట్ల రిజర్వేషన్లకు అమలులో ఉన్న 30 రోజుల గడువును 4 నెలలకు పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇదే తరహా విధానాన్ని రైల్వేలో అమలు చేస్తున్నారు. రైల్వేలో సత్ఫలితాలనిస్తోందని భావించిన ఆర్టీసీ అధికారులు.. బస్ టికెట్ విషయంలో కూడా ఈ విధానం అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ జేఎండీ రమణరావు నిర్ణయించారు. ఈ వెసులుబాటును సోమవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.