సుష్మా జీ.. నా సోదరిని రక్షించండి
తక్షణం స్పందించిన సుష్మా... యువతికి వీడిన చెర
దుబాయ్: ఆమె ఓ ఎయిర్ హోస్టెస్. మంచి కెరీర్ కోసమని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లింది. అయితే ఉద్యోగాల పేరిట తీసుకెళ్లిన ఏజెంట్లు ఆమెనక్కడ మరికొందరితో కలిసి నిర్బంధించారు. ఉద్యోగరీత్యా ఖతార్‌లో ఉంటున్న ఆమె సోదరుడు దేవ్ తంబోలికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఈనెల 21న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు. ‘సుష్మా జీ... నా సోదరి ఈనెల 14న యూఏఈకి వెళ్లింది.
ఏజెంట్లు ఆమెనక్కడ నిర్బంధించారు. కొడుతున్నారట కూడా... దయచేసి సహాయం చేయండి’ అని కోరాడు. దాంతో సుష్మా స్పందించి యూఏఈలోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని రంగంలోకి దింపారు. స్థానిక పోలీసులు, ప్రవాస భారతీయుల సహాయంతో మొత్తం మీద 33 ఏళ్ల యువతిని రక్షించారు. ఈ విషయాన్ని సుష్మా వెంటనే తంబోలికి ట్వీట్ ద్వారా తెలిపారు. రాయబార కార్యాలయం నడిపే శరణాలయానికి తరలించామని, ఆమె క్షేమంగా ఉందని తెలిపారు.