ఇదొక ఎమోషనల్ జర్నీ - నాగచైతన్య
‘‘ఈ ట్రైలర్స్ చాలా విభిన్నంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. నాగచైతన్య, సమంతది హిట్ కాంబినేషన్. తప్పకుండా ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డా. డి. రామానాయుడు. నాగచైతన్య, సమంత జంటగా దేవా కట్టా దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్ సమర్పణలో మాక్స్ ఇండియా పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆటోనగర్ సూర్య’. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రామానాయుడు ఆవిష్కరించి, రానాకి అందజేశారు.
‘‘ఈ సినిమా ఎలా ఉంటుందో ఫిబ్రవరి 7న చూస్తారు. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది’’ అని ఈ సందర్భంగా అచ్చిరెడ్డి అన్నారు. దేవా కట్టా మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కథలో ఉన్న ఆత్మని పరిపూర్ణంగా నమ్మి చేశారు చైతన్య, సమంత. వాళ్ల నమ్మకం, బలం లేకపోతే ఈ సినిమా బాగా వచ్చి ఉండేది కాదు. నిర్మాణంలో ఎన్నో ఒడిదుడుకులనుఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కథని నమ్మడమే కాకుండా, ఎంతో స్వేచ్ఛనిచ్చిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా థియేటర్ నుంచి మీ ఇంటివరకు మిమ్మల్ని వెంటాడుతుంది’’ అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ -‘‘ఈరోజు కోసం ఎదురు చూశారు. నా కల నిజమైంది. ఈ సినిమా చేయడం అనేది చాలా ఎమోషనల్ జర్నీ. నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా అభిమానులు ఎప్పుడు కలిసినా, ‘ఆటోనగర్ సూర్య’ గురించే అడిగేవారు. ఈ సినిమా మీద అంత నమ్మకం పెట్టారు. ఈ సినిమా ద్వారా నాకు ఏ ప్రశంస వచ్చినా... అది పూర్తిగా దేవాకే దక్కుతుంది. తనతో మళ్లీ మళ్లీ సినిమా చేయడానికి సిధ్దంగా ఉన్నాను. అనూప్ మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో ఎస్వీ కృష్ణారెడ్డి, సుకుమార్, సి.కళ్యాణ్, అలంకార్ ప్రసాద్, గౌతంరాజు, విజయ్‌కుమార్ కొండా, సాయికుమార్, సుశాంత్, అనూప్ రూబెన్స్, సురేష్‌రెడ్డి, సమంత, నందు, సంజన తదితరులు పాల్గొన్నారు.