దైవ దర్శనానికి వెళ్లొస్తామంటూ.. ముగ్గురి బలవన్మరణం
దేవరకద్ర/దేవరకద్ర రూరల్: దైవ దర్శనానికి వెళ్లొస్తామని బంధువులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల్లో తల్లి, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దేవరకద్రకు చెందిన బాలకిష్టమ్మ (55) కుమారుడు రాజు, కూతురు సంతోషతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారం రోజుల నుంచి బాలకిష్టమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది.
మరోవైపు లాక్డౌన్ కారణంగా వ్యాపారంలో నష్టం వచ్చింది. దాయాదులతో ఆస్తి తగాదాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మన్యంకొండ దేవస్థానానికి వెళ్లొస్తామని బంధువులకు చెప్పి ఈనెల 24న ఇంటి నుంచి బయలుదేరి తిరిగిరాలేదు. బుధవారం సాయంత్రం చౌదర్పల్లి గుట్టపై మొక్కలకు నీరు పోయడానికి వెళ్లిన కూలీలకు కుళ్లిన మూడు శవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి దర్యాప్తు చేయగా.. ఈ విషయం బయటపడింది. రెండురోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.