ఆణ్ దేవతై అంటున్న సముద్రకని
సాధారణంగా దేవతలు, దేవుళ్లు అంటారు. అలాంటిది నటుడిగా రాణిస్తున్న దర్శకుడు సముద్రకని ఆణ్ దేవతై(మగదేవత) అనే టైటిల్‌తో చిత్రం చేస్తున్నారు. అప్పా చిత్రంతో దర్శకుడిగా, కథానాయకుడిగా అనూహ్య విజయాన్ని సాధించిన సముద్రకని తాజాగా నటిస్తున్న చిత్రం ఆణ్ దేవతై. దీనికి దివంగత ప్రఖ్యాత దర్శకుడు కే.బాలచందర్ శిష్యుడు తామరై కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ తన గురు భక్తికి చిహ్నంగా శిఖరం సినిమాస్ బ్యానర్‌ను నెలకొల్పి మరో నిర్మాత ప్రకృద్ధీన్తో కలిసి నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తుండడం విశేషం.
ఈ దర్శకుడు ఇంతకు ముందు తన గురువు కే.బాలచందర్, మరో ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా నటించిన రెట్టైచుళి అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం.ఈయన తాజా చిత్రం ఆణ్ దేవతై చిత్రాన్ని శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం గురించి వివరిస్తూ ఇవాళ ప్రపంచీకరణ, నగరీకరణ మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయన్నారు.
కట్టుకునే బట్టల నుంచి మొబైల్‌ఫోన్ వరకూ అన్నీ డ్లోబల్ వరల్డ్కనుగుణంగానే జరుగుతున్నాయన్నారు. ఇక తండ్రి పోషణలో పెరిగే పిల్లలకు, తల్లి పెంపకంలో పెరిగే పిల్లలకు మధ్య వ్యత్యాసం ఏమిటీ, అదే విధంగా రుణాలకు అలవాటు పడ్డ మనిషి జీవితం ఎలాంటి స్థితికి దిగజారిపోతుందీలాంటి పలు అంశాల గురించి చర్చించే చిత్రంగా ఆణ్ దేవతై ఉంటుందన్నారు. ఇందులో సముద్రకని, రమ్యాపాండియన్, కవిన్, కస్తూరి, ఇళవరసు, శ్రీనిక, ప్రగదీశ్, అరుణ్మొళి, దిలీపన్ ముఖ్య పాత్రలు పోషింస్తున్నారని తెలిపారు.