బెంగళూరు అభివృద్ధికి గుజరాత్ వెలుగులు
సాక్షి, బెంగళూరు : గుజరాత్ అభివృద్ధి వెలుగులు బెంగళూరులో కూడా పూయించనున్నారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్-2015 కోసం కార్పొరేట్ ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతూ శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో రోడ్ షో నిర్వహించారు. దీనికి గుజరాత్ రాష్ట్ర ఆర్థిక, ఇంధన, పెట్రో రసాయనాల మంత్రి సౌరబ్భాయ్ పటేల్ నేతృత్వం వహించారు. నగరానికి చెందిన 300 మందికి పైగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 13 వరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో వైబ్రంట్ గుజరాత్ జరగనున్న విషయం తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ విదేశీ పారిశ్రామికవేత్తల్ని పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం పలుకుతూ ప్రారంభించిన వైబ్రంట్ గుజరాత్ ఎడిషన్లలో ఇది ఏడవది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
జపాన్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ దేశాల భాగస్వామ్యంతో వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమం జరుగుతోంది. రోడ్ షో సందర్భంగా గుజరాత్ ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక ప్రజెంటేషనిచ్చారు. గుజరాత్ అభివృద్ధితో పొరుగు రాష్ట్రాలు ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నాయో ఈ ప్రజెంటేషన్లో వివరించారు. అనంతరం మంత్రి నగరానికి చెందిన వ్యాపారవేత్తల్ని విడివిడిగా కలుసుకున్నారు. అదనపు చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు) డి.జె.పాండ్యన్, ఇంధన, పర్యావరణ, విద్య, ఐటీ, పట్టణ ప్రణాళికా విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.