development project
-
మూసీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సోమవారం నానక్‌రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు నగరంలోని 55 కిలోమీటర్ల మార్గంలో ఉన్న మూసీనదీ పరీవాహక ప్రాంతాలు సరిహద్దులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారు. ప్రక్షాళనకు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలగించాల్సిన నిర్మాణాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించినట్టు తెలిసింది. అనంతరం సీఎం మాట్లాడుతూ వీలైనంత త్వరగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టాలని అధికారులకు చెప్పారు. మొదట క్లీనింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ఇటీవల బడ్జెట్లో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ పనులపై దృష్టి సారించింది. మూసీ నదిని మూడు ప్రధాన విభాగాలుగా విభజించి పనులు చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ చేపట్టారు. అందంగా.. ఆహ్లాదంగా... హైదరాబాద్ మహానగరానికి పడమటి నుంచి తూర్పు వరకు మెలికలు తిరుగుతూ వడ్డాణం అలంకరించినట్టుండే మూసీనది నిజాం కాలంలో పరవళ్లు తొక్కింది. నగరంలో 55 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్న మూసీనదికి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు గతంలోనే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా పెద్దగా పురోగతి లేదు. ప్రసుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. మూసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తూర్పు–పడమర మధ్య మెట్రో మార్గం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లండన్‌లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మూసీ అభివృద్ధికి ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ ప్రభుత్వంతో ఇటీవల సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీకి రెండువైపులా ఎమ్యూస్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చి్రల్డన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్ బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేస్తారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, తారామతి బారదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ కూడా డిజైన్ చేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. -
విదేశీ అనుభవం వెనుక హేతుబద్ధత ఏమిటి...?
ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ‘రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకునే కంపెనీలకు తప్పనిసరిగా విదేశీ అనుభవముండాలన్న నిబంధనలు విధించడం వెనుకున్న హేతుబద్ధత ఏమిటి? హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీల అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది దేశీయ కంపెనీలే కదా? ఆ పనులను ఆ కంపెనీలు ఆషామాషీగా చేయలేదు? అలాంటిది దేశీయ కంపెనీలకు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్య అవకాశం కల్పించకపోవడంలో హేతుబద్ధత ఏమిటి?’ అని హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదే విధంగా విదేశీ కంపెనీని జాయింట్ వెంచర్ (జేవీ)గా ఎంపిక చేసుకుని, బిడ్ దాఖలు చేసేందుకు 45 రోజుల గడువు సరిపోతుందా? అని కూడా ప్రభుత్వాన్ని అడిగింది. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి గత నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సీఆర్డీఏలు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారణ జరిపింది. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి దురుద్దేశాలున్నట్లు సింగిల్ జడ్జి తన తీర్పులో ఎక్కడా చెప్పలేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయడమే కాక, అంతే వేగంగా మార్కెటింగ్ ప్రక్రియనూ పూర్తి చేసే సామర్థ్యం కంపెనీలకు ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అందుకే విదేశీ అనుభవాన్ని ఓ నిబంధనగా పెట్టామని చెప్పారు. -
సింగపూర్ కన్సార్టియంపై ముందే నిర్ణయం
హైకోర్టుకు నివేదించిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులను సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకుందని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ హైకోర్టుకు నివేదించారు. సింగపూర్ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపిన తరువాతే పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. స్విస్ చాలెంజ్ కింద సింగపూర్ కంపెనీల కన్సార్టియం సుమోటో (తనంతట తాను)గా స్పందించి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సమర్పించిందంటూ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘భారతదేశం వెలుపల’ అన్న షరతు విధించి, దేశీయ కంపెనీలేవీ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేస్తోందని వివరించారు. తద్వారా ముందస్తుగా అనుకున్న సింగపూర్ కంపెనీల కన్సార్టియంకే పనులు అప్పగించేందుకు మార్గం సుగమం చేసుకుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ప్రతి దశలోనూ నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరుతూ సీఆర్డీఏ కమిషనర్ ఇటీవల జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చెన్నైకి చెందిన ఎన్వీయన్ ఇంజనీర్స్ లిమిటెడ్ కూడా టెండర్ నోటిఫికేషన్‌ను, ఆ తరువాత జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం విచారణ జరిపారు. ఆదిత్య హౌసింగ్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, ఎన్వీయన్ ఇంజనీర్స్ తరఫున వేదుల వెంకటరమణ తమ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.