సింగపూర్ కన్సార్టియంపై ముందే నిర్ణయం
హైకోర్టుకు నివేదించిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులను సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకుందని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ హైకోర్టుకు నివేదించారు. సింగపూర్ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపిన తరువాతే పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. స్విస్ చాలెంజ్ కింద సింగపూర్ కంపెనీల కన్సార్టియం సుమోటో (తనంతట తాను)గా స్పందించి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సమర్పించిందంటూ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘భారతదేశం వెలుపల’ అన్న షరతు విధించి, దేశీయ కంపెనీలేవీ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేస్తోందని వివరించారు.
తద్వారా ముందస్తుగా అనుకున్న సింగపూర్ కంపెనీల కన్సార్టియంకే పనులు అప్పగించేందుకు మార్గం సుగమం చేసుకుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ప్రతి దశలోనూ నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరుతూ సీఆర్‌డీఏ కమిషనర్ ఇటీవల జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
చెన్నైకి చెందిన ఎన్వీయన్ ఇంజనీర్స్ లిమిటెడ్ కూడా టెండర్ నోటిఫికేషన్‌ను, ఆ తరువాత జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం విచారణ జరిపారు. ఆదిత్య హౌసింగ్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, ఎన్వీయన్ ఇంజనీర్స్ తరఫున వేదుల వెంకటరమణ తమ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.