నాలుగేళ్లలో నిర్వహణ నిధి రెట్టింపు
2028 నాటికి సాధించనున్నట్టు ప్రకటన
ముంబై: అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ మేనేజర్, సింగపూర్‌కు చెందిన ‘క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ (సీఎల్‌ఐ).. భారత్‌లో తన నిర్వహణలోని ఫండ్ (ఎఫ్‌యూఎం) విలువను 2028 నాటికి రెట్టింపు చేసుకోన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎఫ్‌యూఎం 7.4 బిలియన్ సింగపూర్ డాలర్లు (రూ.46,000 కోట్లు)గా ఉంది. 30 ఏళ్ల క్రితం ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం గమనార్హం. అప్పటి నుంచి వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్మించుకుంది.
హైదరాబాద్ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో 40 ఐటీ, బిజినెస్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్‌లు, డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. ఐటీ పార్క్‌లు, లాజిస్టిక్స్ పార్క్‌ల వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు.. పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో అవకాశాలనూ పరిశీలిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘భారత్ మాకు వ్యూహాత్మక మార్కెట్. మా మొత్తం వ్యాపారంలో కీలక వాటాను ఆక్రమిస్తోంది.
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌లో గడిచిన ఏడేళ్లలో మా పెట్టుబడులు మూడింతలయ్యాయి. 2024లో భారత జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న అంచనాలున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ సంస్థలు, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లను భారత్‌లో నాణ్యమైన రియల్ అసెట్స్ ఆకర్షిస్తున్నాయి’’అని సీఎల్‌ఐ గ్రూప్ సీఈవో లీచీ కూన్ తెలిపారు. భారత మార్కెట్‌లో తమకు ఎంతో అనుభవం కలిగి ఉండడంతో ఈ అవకాశాలను సొంతం చేసుకోగలమని.. తమ నిర్వహణలోని నిధిని 2028 నాటికి 7.4 బిలియన్ డాలర్లకు పెంచుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment