ప్లాంటును సందర్శించిన పోలాండ్ రాయబారి డాక్టర్ సెబాస్టియన్ డొమ్‌జల్‌స్కి
యూరోపియన్ రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు కీలక విడిభాగాలు చేసి ఇస్తున్న సంస్థ
హైదరాబాద్: పోల్‌మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ రైల్వే కంపెనీలకు కీలకమైన విడిభాగాలు తయారుచేసి ఇచ్చే సంస్థ. ఈ కంపెనీ తెలంగాణలో భారీగా విస్తరించి, దీని ద్వారా ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్దమవుతోంది. మెదక్ జిల్లాలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆటోమోటివ్ పార్కులో ఉన్న ఈ సంస్థ వృద్ధి బాటలో కొనసాగుతోంది.
భారతదేశంలో పోలాండ్ రాయబారి డాక్టర్ సెబాస్టియన్ డొమ్‌జల్‌స్కి ఈ ప్లాంటును గురువారం సందర్శించారు. ఆయనతో పాటు పోలండ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అలెక్సాండర్ దండా, పోలాండ్ రాయబార కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల కౌన్సెలర్ పావెల్ మోక్ర్‌జైకి, పొల్మోర్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు కూడా ఉన్నారు. ఈ బృందం ఇప్పుడున్న ప్లాంటుతో పాటు నిర్మాణంలో ఉన్న రెండో ప్లాంటునూ సందర్శించింది.
భారతదేశంలో ఒక పోలాండ్ కంపెనీ సాధిస్తున్న వృద్ధిని చూసి రాయబారి డొమ్‌జల్‌స్కీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు పోల్‌మోర్ స్టీల్‌ను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న మేకిన్ ఇండియా విధానానికి అనుగుణంగా సాగుతున్న ఈ కంపెనీ తన విజయాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు.
తమ సంస్థ విస్తరణ వ్యూహాల గురించి పోల్‌మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు మాట్లాడుతూ.. “భారతదేశంలో పలు యూరోపియన్ కంపెనీలు ఉన్నాయి. అదే బాటలో పోల్‌మోర్ స్టీల్ మరింతగా విస్తరించనుందని గర్వంగా చెబుతున్నాం. మరో మూడు ఎకరాల భూమి తీసుకుని 2.5 మిలియన్ యూరోల పెట్టుబడి కూడా సంపాదించి, అదనంగా మరో వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. అంతే కాకుండా.. పోలాండ్‌లోని మాతృసంస్థలో కూడా 30 మంది పోల్‌మోర్ స్టీల్ ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లి పనిచేస్తున్నారు. దీనివల్ల మనవాళ్లు యూరప్ వెళ్లి అక్కడ నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు యూరోపియన్ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారుచేయడానికి వీలవుతోంది” అని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీలతో పాటు, వివిధ వర్గాల నుంచి అందుతున్న అపార మద్దతు పట్ల సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్లాంటుకు వచ్చి తమను ప్రోత్సహించినందుకు రాయబారికి, కాన్సుల్ జనరల్‌కు, ఆర్థిక కౌన్సెలర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment